హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం విడుదల చేసిన 203 జీవో పై దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డి పాడు కొనసాగింపుగా నీళ్లను రాయలసీమ ప్రాంతానికి తరలించాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు నిరసన వ్యక్తం చేశాయి. ఇదే అంశంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ జీవో 203 తో కృష్ణనుండి నీటిని తరలించేందుకు తెచ్చినా కేసీఆర్ కు పట్టడంలేదని, ఆగస్టు 12న వైసిపి ఎమ్మెల్యే రోజా ఇంటిలో రాగిసంకటి, నాటుకోడి పులుసు తిని సీమకు నీళ్లిస్తా అని కేసీఆర్ చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు.
కేసీఆర్ అనుమతితోనే ఏపీ సీఎం జగన్ జీవో 203 తెచ్చారని, కేసీఆర్ కేటీఆర్, హరీష్ రావు 203 జీవో గురించి అందుకే మాట్లాడటం లేదని, పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు కేంద్రం పర్యవేక్షణలో ఉండాలన్నారు. ఏపీకి ఇష్టం వచ్చినప్పుడు గేట్ తెరుచుకుని నీళ్ళు దోచుకుంటుందని, కేసీఆర్, జగన్ ఇంటిసమస్య కాదని, పోతిరెడ్డి పాడు తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్యన్నారు.
పోతిరెడ్డి పాడు జల దోపిడీపై పీఎం మోదీ, జలవనరుల శాఖ మంత్రికి లేఖలు రాస్తామని, నాడు పోతిరెడ్డి పాడుపై పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డిలు అలుపెరగని పోరాటం చేశారన్నారు. పోతిరెడ్డి పాడు నీళ్ళ దోపిడీని కాంగ్రెస్ అడ్డుకుని తీరుతుందని, ప్రస్తుతం 55వేల క్యూసెక్కులు పోతిరెడ్డి పాడునుండి నీళ్ళు వెళుతుంటే కేసీఆర్ ఆరేళ్లుగా ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..