Telangana Election Surveys: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా నెలరోజులు సమయం ఉంది. నవంబర్ 30 పోలింగ్, డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాలతో పాటు ఫలితాల వెల్లడి ఉంటుంది. రాష్ట్రంలో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నెలకొన్న నేపధ్యంలో సర్వే సంస్థలు ఏం చెబుతున్నాయో పరిశీలిద్దాం.
తెలంగాణలో ఎన్నికల తేదీ సమీపించేకొద్దీ వివిధ రకాల సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఒక్కొక్క సంస్థ సర్వే ఒక్కోలా ఉండటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొడతామని అధికార బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంటే..కాంగ్రెస్ మాత్రం ఈసారి తప్పకుండా అధికారం మాదేనంటోంది. తెలంగాణలో ఓటింగ్ గణనీయంగా పెంచుకున్న బీజేపీ సైతం అధికారం తమదేనంటోంది. ఒక్కొక్క సంస్థ సర్వే ఒక్కోలా ఉండటంతో పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది. కొన్ని సర్వేలు బీఆర్ఎస్ పార్టీకు పట్టం కడుతుంటే మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇంకొన్ని సంస్థలైతే ఏ పార్టీకు స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చంటున్నాయి. ఈ సర్వేలన్నీ ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి అంచనా వేసి చెబుతున్నవే. ఎన్నికల నాటికి మారే సమీకరణాలు, నేతల పార్టీ మార్పిడి, ఇతర పరిణామాలతో పోలింగ్ నాటికి ఓటరు మూడ్ మారిపోవచ్చు.
ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ప్రకారం
119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకు అత్యధికంగా 54 స్థానాలు వస్తాయని, అధికార బీఆర్ఎస్ మాత్రం ఈసారి 49 స్థానాలకు పరిమితమౌతుందని అంచనా వేసింది. బీజేపీ మాత్రం ఈసారి ఏకంగా 8 స్థానాలు గెల్చుకుంటుందని ఇండియా టుడే సీ ఓటర్ సంస్థ వెల్లడించింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 28 శాతం ఓటు శాతం కలిగి ఉంటే ఈసారి 39 శాతానికి చేరుకుంటుందని తెలిపింది. ఇక బీఆర్ఎస్ మాత్రం 47 నుంచి 38 శాతానికి పడిపోనుంది. అధికారం కోసం కావల్సిన మేజిక్ ఫిగర్ 60 కాగా ఏ పార్టీకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడం గమనార్హం.
ఆత్మ సాక్షి సర్వే ప్రకారం
ఆత్మసాక్షి సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం అధికార బీఆర్ఎస్ పార్టీకు 64-70 స్థానాలు రావచ్చు. కాంగ్రెస్ పార్టీకు 37-43 స్థానాలు దక్కుతాయి. ఇక బీజేపీకు 5-6 స్థానాలు లభిస్తాయి. మజ్లిస్ పార్టీకు 6-7 స్థానాలు లభించవచ్చు. బీఆర్ఎస్ పార్టీకు 42.5 శాతం, కాంగ్రెస్‌కు 36.5 శాతం ఓటు షేర్ లభించనుంది.
పోల్ ట్రాకర్ సంస్థ సర్వే ఇలా
పోల్ ట్రాకర్ సంస్థ జరిపిన సర్వేలో మాత్రం కాంగ్రెస్ పార్టీకు అనుకూలంగా ఫలితాలున్నాయి. ఈ సంస్థ మొత్తం 1,54,851 మంది అభిప్రాయలు తీసుకుంది. అక్టోబర్ 1-28 వరకూ సర్వే నిర్వహించామంటోంది. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీకు 64-71 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకు 39-43 స్థానాలు లభించనున్నాయి. బీజేపీకు 3-5 స్థానాలు, మజ్లిస్ పార్టీకు 2-5 స్థానాలు లభిస్తాయి.
ఒక్కొక్క సంస్థ సర్వే ఒక్కోలా ఉండటంతో ఏం జరుగుతుందోననేది అంతుచిక్కడం లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం పూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇటు రెండు పార్టీల్లో చేరికలు కూడా కొనసాగుతున్నాయి.
Also read: Telangana Elections 2023: మేము ఎన్నడు హింసకు దిగలేదు: బాన్సువాడ సభలో సీఎం కేసీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook