ఎలక్షన్ రెడ్డి.. ఏంటి ఈ పేరు చాలా చిత్రంగా ఉంది అనుకుంటున్నారా..? కానీ గజ్వేల్ వాసులకు ఈ పేరు బాగా పరిచయమున్న పేరు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం రామాయంపల్లి ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ నేత పేరు ఎలక్షన్ రెడ్డి. 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు జరిగిన రోజున ఈయన పుట్టారట. అందుకే ఆయనకు ఎలక్షన్ రెడ్డి అని పేరు పెట్టారు ఆయన తల్లిదండ్రులు. అయితే ఈ పేరు చాలా విచిత్రంగా ఉండడంతో ఆయనకు పాపులారిటీ కూడా అదే స్థాయిలో దక్కింది. తర్వాత అదే పాపులారిటీతో ఆయన రాజకీయాల్లోకి కూడా వచ్చారు.
తొలుత 1980లో గజ్వేల్ గ్రామ పంచాయతీ ఉపాధ్యక్ష పదవిని పొందిన ఆయన మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)కు చైర్మన్‌గా, ఆప్కాబ్ డైరెక్టర్‌గా, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. టీడీపీలో రెండు సార్లు రాష్ట్ర కార్యదర్శి పదవిని కూడా పొందారు. తర్వాత మెగాస్టార్ పై అభిమానంతో ప్రజా రాజ్యం పార్టీలో చేరారు. 2009లో గజ్వేల్ నుండి ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన ఎలక్షన్ రెడ్డి.. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. బీఏ వరకు చదువుకున్న ఎలక్షన్ రెడ్డి.. 1984లో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. చిత్రమేంటంటే.. ఎలక్షన్ రెడ్డి పేరు పాపులర్ అయ్యాక.. అదే పేరును తమ పిల్లలకు చాలామంది పెట్టుకున్నారట.