తెలంగాణ ఐటీ, పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే.టీ.రామారావు బుధవారం రాజన్నా-సిరిసిల్లా జిల్లాలోని ఇల్లంతకుంట, వేములవాడ, ఎల్లారెడ్డిపేట్ మండలాల్లో రైతు బంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం రైతు భీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకి రూ.5 లక్షల భీమా కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని కొనసాగించేలా దీర్ఘకాలికంగా ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు.
గత ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశాయని, రైతులపై వేధింపులకు పాల్పడ్డాయని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసమే రైతు బంధు పథకాన్ని తీసుకురావడం జరిగిందని, ఇది వ్యవసాయానికి ఆచరణీయమైనదని అన్నారు. రాజన్న-సిరిసిల్లా జిల్లాకు సంవత్సరంలోగా గోదావరి నదీ జలాన్ని తీసుకువస్తామని, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శరవేగంగా పూర్తికావోస్తుందని కేటీఆర్ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పెంచాలని, రైతులకు ప్రయోజనం కోసం వ్యవసాయంతో ఎన్ఆర్ఈజీఎస్‌ను అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కేటీఆర్.