హైదరాబాద్: తెలంగాణలో నేడు జరగనున్న చివరి దశ పంచాయతీ ఎన్నికలకు యధావిధిగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. చివరి దశలో 4,115 పంచాయతీల్లో ఎన్నికలకు ఈసీ నోటీఫికేషన్ జారీచేయగా అందులో 576 గ్రామ పంచాయతీలకు సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో 10 గ్రామాల్లో ఎన్నికలకు అసలు నామినేషన్లే దాఖలు కాలేదు. ఇక హైకోర్టు ఆదేశాలతో భూపాలపల్లి జిల్లా మంగపేట మండలంలో ఎన్నికలు నిలిచిపోయాయి. మండలం అన్ని పంచాయతీలు ఎస్టీకి రిజర్వు చేయడంతో ఎన్నికలు రొటేషన్ పద్దతిలో నిర్వహించాలని పలువురు స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రస్తుతానికి 25 పంచాయతీల్లో ఎన్నికలు నిలిపేయాల్సిందిగా కోర్టు ఈసీని ఆదేశించింది. అవి కాకుండా మిగితా 3,506 పంచాయతీలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఇవ్వనున్నారు.
మధ్యాహ్న భోజన విరామం అనంతరం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి గెలుపొందిన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతో చివరి దశ పోలింగ్ ముగియనుంది. ఇప్పటివరకు జరిగిన రెండు దశల్లోనూ టీఆర్ఎస్ పార్టీనే ఎక్కువ స్థానాలు గెలుచుకోగా ఇక చివరిదైన నేటి ఎన్నికల్లో అత్యధిక గెలుపు శాతం ఎవరిని వరించనుందనేది ఇంకొన్ని గంటల్లోనే తేలిపోనుంది.