Daughter's Deadbody Carried on Bike: ఆకాశంలోకి రాకెట్స్ దూసుకెళ్తున్నాయి.. మరో గ్రహంపై మనిషి మనుగడకు పరిశోధనలు జరుగుతున్నాయి.. ఒకేసారి పదుల సంఖ్యలో ఉపగ్రహాలు నింగిలోకి దూసుకెళ్లి గమ్యాన్ని చేరుకుంటున్నాయి. సముద్ర గర్భంలో, భుమి లోపలి పొరల్లో ఏముందో తెలుసుకుంటున్నాం.. కానీ మనం తిరుగుతున్న నేలపై మనిషి ఎదుర్కొంటున్న కష్టాలకు పరిష్కారం మాత్రం చూపలేకపోతున్నాం. పేదరికం అనే భూతాన్ని, ఆ పేదరికంతో వచ్చే కష్టాలను పారదోలలేకపోతున్నాం.
తాజాగా ఓ మూడేళ్ల చిన్నారి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యంతో కన్నుమూసింది. చనిపోయిన తన కన్న బిడ్డ శవాన్ని అంబులెన్సులో తరలించేంత ఆర్థిక స్తోమత లేని ఆ తండ్రి.. బైకుపైనే తన కూతురు శవాన్ని తీసుకుని ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 65 కిలోమీటర్లు ప్రయాణించి తన గ్రామాన్ని చేరుకున్నాడు. ఇదంతా జరిగింది ఎక్కడో కాదు.. మన ఖమ్మం జిల్లాలోనే.
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం కొత్త మేడేపల్లి గ్రామానికి చెందిన ఓ మూడేళ్ల గిరిజన బాలిక జ్వరంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఖమ్మం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆ బాలిక తుదిశ్వాస విడిచింది. కళ్ల ముందే కన్నబిడ్డ ప్రాణాలు విడవడం చూస్తూ కన్నీరుమున్నీరైన ఆ తల్లిదండ్రులకు కొన్ని క్షణాల్లోనే అలాంటి కష్టమే మరొకటి వచ్చిపడింది.
కన్నబిడ్డ శవాన్ని సొంతూరికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులకు ఆస్పత్రి వర్గాల నుంచి ఉచిత అంబులెన్స్ సౌకర్యం లేదనే జవాబొచ్చింది. అప్పటికే కూతురు లేదనే దుఖం దిగమింగుకుంటున్న ఆ తల్లిదండ్రులకు ఇది మరో షాక్ నిచ్చింది. భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి ప్రైవేటు అంబులెన్స్ సౌకర్యం తీసుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఇలా కన్నకూతురి శవాన్ని బైకుపైనే 65 కిలో మీటర్లు తీసుకెళ్లాడు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ ఘటనకు సంబంధించిన వార్త వెలుగులొకొచ్చింది.