తెలంగాణ కాంగ్రెస్ కు హరీష్‌రావు 12 ప్రశ్నల లేఖాస్త్రం !

      

Last Updated : Oct 9, 2018, 09:55 PM IST
తెలంగాణ కాంగ్రెస్ కు హరీష్‌రావు 12 ప్రశ్నల లేఖాస్త్రం !

హైదరాబాద్: ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై మరోకరు వాడీ వేడీగా విమర్శించుకుంటున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలో మహాకూటమి పేరుతో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని తప్పుబడుతూ టి కాంగ్రెస్ కు హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి 12 ప్రశ్నలు సంధించారు. హరీష్ రావు సంధించిన ప్రశ్నలు ఒక్కసారి పరిశీలిద్దాం...

* తెలంగాణకు అడ్డుతగిలిన టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో ప్రజలకు చెప్పగలరా ?

* తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీడీపీ వైఖరి మార్చుకున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరోలో తీర్మానం చేశారా ?

* గోదావరి,  కృష్ణా జలాల్లో వాటాకు సంబంధించి ట్రిబ్యునళ్లలో జరుగుతున్న వాదనల విషయంలో చంద్రబాబు వైఖరి మార్చుకుంటున్నారా ?

*  సీలేరు హైడెల్ కేంద్రాన్ని తిరిగి తెలంగాణకు తిరిగి ఇప్పిస్తారా?

* తెలంగాణకు ఇబ్బంది కలగని రీతిలో పోలవరం డిజైన్ మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారా ?

* పోలవరం ఏడు మండలాలు తిరిగి ఇచ్చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారా ?

* పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న బాబు తన వైఖరి మార్చుకుని మళ్ళీ కేంద్రానికి లేఖ ఇచ్చారా?

* కాళేశ్వరం, సీతారామ తదితర ప్రాజెక్టులపై కేంద్రానికి ఇచ్చిన లేఖను చంద్రబాబు వాపసు తీసుకున్నారా ? 

* తెలంగాణకు నీళ్లు వద్దంటున్న బాబుతో కృష్ణా జలాలను  ఇప్పిస్తామని చెప్పించగలరా?

*  మిషన్ భగీరథ ద్వారా అందరికీ నీళ్లిచ్చే ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న చంద్రబాబు వైఖరి మారిందా ?

* నిజాం ఆస్తులపై బాబు వాదన ఏమైనా మార్చుకున్నారా ?

* ఏపీకి చెందిన ఉద్యోగులను తీసుకోవడానికి చంద్రబాబు బాబును ఒప్పుకున్నారా ?

* హైకోర్టు తో సహా మిగతా విభజన హామీలపై బాబుతో హామీ తీసుకున్నారా ?

ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి చంద్రబాబుతో పొత్తు వల్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న భయాందోళనలను తెలంగాణ కాంగ్రెస్ నివృత్తి చేయాలని కోరారు. మహాకూటమి కనీస ఉమ్మడి ప్రణాళికలో చంద్రబాబుతో ఈ పన్నెండు అంశాలపై సంతకం పెట్టిస్తారా? అని ఈ సందర్భంగా  హరీష్ రావు ప్రశ్నించారు. తాజా లేఖపై కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు స్పందిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

Trending News