వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఇంటి ఫస్ట్ ఫ్లోర్‌లో దెయ్యం ఉందట!

ఐఏఎస్ ఆఫీసర్ అధికారిక బంగ్లాలో దెయ్యం ఉందట!

Last Updated : Aug 15, 2018, 09:17 PM IST
వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఇంటి ఫస్ట్ ఫ్లోర్‌లో దెయ్యం ఉందట!

దెయ్యాలు, భూతాలు ఉన్నాయని ప్రజలు అనవసర భయాందోళలనకు గురైన సందర్భాల్లో... అసలు దెయ్యాలు, భుతాలు అనేవే లేవు.. అవన్నీ ఉత్తుత్తి అపోహలే అని తరచుగా చెప్పే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల నోటి వెంట దెయ్యం ఉందట అనే మాట వస్తే, అదెలా ఉంటుంది! అది కూడా ఎన్నో సందర్భాల్లో జనం చేత శభాష్ కలెక్టరమ్మ అనిపించుకున్న ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి లాంటి వాళ్ల నోట వినిపిస్తే, ఇంకా అదెంత ఆశ్చర్యకరంగా ఉంటుంది! కానీ ఇటీవల ఈ కలెక్టర్ నోట దెయ్యం మాటే వినిపించిందని తెలుస్తోంది. 

వివిధ సందర్భాల్లో పత్రికల్లో పతాక శీర్షికల్లోకి ఎక్కి, వార్తల్లో నిలిచిన వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలికి సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమంటే.. వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఇంటి ఫస్ట్ ఫ్లోర్‌లో దెయ్యం ఉందట! అవును, ఈ మాటలు అంది ఎవరో కాదట.. స్వయంగా కలెక్టర్ నోటి నుంచి వచ్చిన మాటలుగా వార్తా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలికి దెయ్యమంటే భయమట. అంతేకాకుండా దెయ్యం మరెక్కడో లేదు... తన ఇంట్లోనే ఉందని చెప్పారామె. ఆగస్టు 10న వరంగల్‌ కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయం నిర్మాణానికి పునాదిరాయి వేసి 133 ఏళ్లు నిండిన సందర్భంగా తాను నివాసముంటున్న ఇంటి గురించి మాట్లాడుతూ ఆమ్రపాలి ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. తాను నివాసం ఉంటున్న అధికారిక నివాసం గురించి చెబుతూ బంగ్లాలోని మొదటి అంతస్తులో దెయ్యం ఉన్నట్లు తనకు పాత కలెక్టర్లు చెప్పారని, తనను రాత్రి వేళ అక్కడ పడుకోవద్దని వాళ్లు తనకు సలహా ఇచ్చినట్లు కలెక్టర్ చెప్పడం ప్రస్తుతం చర్చనియాంశమైంది.
 
కలెక్టర్ బంగ్లాకు పునాది వేసిన జార్జ్‌ పామర్‌ అనే వ్యక్తి గురించి తెలుసుకునేందుకు చరిత్రను అధ్యయనం చేయాల్సి వచ్చిందని ఆమ్రపాలి తెలిపారు. నిజాం కాలంలో ఆయన గొప్ప ఇంజనీర్ అని, ఆయన ఆయన భార్య వరంగల్‌ కలెక్టరేటు క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేశారని ఈ సందర్భంగా ఆమ్రపాలి వివరించారు. తాను వరంగల్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బంగ్లాలో పైకి వెళ్లి చూస్తే గదంతా చిందరవందరగా పడి ఉండడంతో దాన్ని సర్దించానన్నారామె. అయినా కూడా ఆ గదిలో దెయ్యం ఉందన్న భయంతో అక్కడ పడుకోవడానికి సాహసించనని ఆమ్రపాలి చెప్పుకొచ్చారు. 

ఇదిలావుంటే, బంగ్లా నాణ్యత గురించి సైతం ఆమ్రపాలి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వర్షం పడినప్పుడు తన బంగ్లాలో వర్షం నీరు లీకు అవుతోందని.. అలాంటప్పుడు గిన్నెలు, బకెట్లు పెట్టుకుని సర్దుకుపోవాల్సి వస్తోందని ఆమ్రపాలి తెలిపారు. బంగ్లా లీకుల సంగతి అలా పక్కనపెడితే, దెయ్యం ఉందట అని ఈ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పడమే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చగా మారింది. అది కూడా పలు సందర్భాల్లో ప్రజల మన్ననలు పొందిన కలెక్టర్ అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటనేదే ప్రస్తుతం చర్చనియాంశంగా మారింది. ఇది మున్ముందు ఎటువంటి మలుపులకు దారితీయనుందో వేచిచూడాల్సిందే మరి.

Trending News