Donald Trump Asks Putin for a Favor: రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇరు దేశాలు అసలు వెనకడుగు వేయకుండా యుద్ధం కొనసాగిస్తున్నారు. యుద్ధం కారణంగా ఇరు దేశాల ప్రజలు అనేక ఇక్కట్లకు గురి అవుతున్నారు. ఒక పక్క ఉక్రెయిన్ రష్యా దాడులను సమర్థవంతంగా తిప్పి కొడుతుంటే.. రష్యా బలగాలు మాత్రం దాడిని చేస్తూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. శత్రువు శత్రువు మిత్రుడంటారు. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఇంకొకడు చలి మంట కాచుకున్నాడట. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి చూస్తే... ఈ రెండు సామెతలను వంటపట్టించుకున్నట్లు ఉన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి కాలుదువ్విన రష్యా అధ్యక్షుడి తీరుపై ఒకపక్క ప్రపంచం మొత్తం ఆగ్రహంతో ఉంటే.. ట్రంప్ మాత్రం పుతిన్ సాయం కోరారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబాన్ని నష్టపరిచే సమాచారం ఏమైనా ఉంటే తెలియజేయాలన్నారు.
ముఖ్యంగా రష్యా సంపన్నుల (ఒలిగార్క్)తో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌కు ఉన్న సంబంధాలను బయటపెట్టాలని కోరారు. రష్యాను కట్టడి చేసేందుకు ఓ వైపు అమెరికా ప్రభుత్వం ఆంక్షలు చట్రం బిగిస్తున్న వేళ.. ట్రంప్ ఇలా బైడెన్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం సర్వత్రా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు పుతిన్ మన దేశానికి అభిమాని కానప్పటికీ ...ఆయన నుంచి ఓ సమాచారం కోరుతున్నానన్నారు ట్రంప్.
మాస్కో మేయర్ భార్య బైడెన్‌లకు 3.5మిలియన్ డాలర్లు ఎందుకిచ్చారన్న ప్రశ్నకు రష్యా అధ్యక్షుడి దగ్గర సమాచారం ఉందని తాను భావిస్తున్నానన్నారు. ఇప్పటికే అమెరికా, రష్యా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పుతిన్ కసాయి అంటూ బైడెన్ తీవ్రంగానే వ్యాఖ్యానించారు. దానికి రష్యా ప్రభుత్వం కూడా కౌంటర్ ఇచ్చింది. తన వ్యాఖ్యలు వివాదాస్పదమైనా .. బైడెన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్నారు. ఇలా ఇరు దేశాల మధ్య వాతావరణం వేడెక్కిన వేళ ట్రంప్ తాజా చర్యలు చర్చనీయాంశమయ్యాయి. మరి దీనికి పుతిన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: Tirumala Darshan: తిరుమలలో శ్రీవారి ప్రత్యేక దర్శనానికి ఇకపై వృద్ధులకు అనుమతి!
Also Read: AP Power Charges Hike: రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు.. యూనిట్ కు ఎంత పెరిగిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook