'కరోనా వైరస్' కారణంగా .. లాక్ డౌన్ విధించడంతో వలస కూలీలు ఇబ్బంది పడుతున్నారు. అందుబాటులో ఉన్న సైకిళ్లు లేదా కాలినడకనే సొంతూళ్లుకు పయనమవుతున్నారు.
కానీ అనారోగ్యంతో ఉన్న వారి పరిస్థితి ఏంటి..? ఇలాగే గురుగ్రామ్ లోని అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వలస కూలీని.. అతని కూతురు జ్యోతి కుమారి .. తన సైకిల్‌పై కూర్చోబెట్టుకుని బీహార్‌లోని సొంత ఇంటికి తీసుకెళ్లింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆ అమ్మాయికి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. సైక్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఆహ్వనించింది. అంతే కాదు.. తాము ఉచితంగా శిక్షణ ఇస్తామని తెలిపింది. ఇప్పుడుఆ అమ్మాయికి మరో అరుదైన ప్రశంస దక్కింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, అమెరికా అధ్యక్షుడికి ప్రధాన సలహాదారు.. ఇవాంకా ట్రంప్.. బీహార్ అమ్మాయిపై ప్రశంసల జల్లు కురిపించారు. జ్యోతి కుమారి.. ఏకంగా 12 వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కడం ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. ఆమె అద్భుతమైన ఫీట్ చేసిందని ఇవాంకా కొనియాడారు. తన తండ్రిపై ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. 15 ఏళ్ల వయసులోనే ఇంతటి అద్భుతమైన ఫీట్ సాధించడం గొప్ప విషయం అంటూ ట్వీట్ చేశారు.
జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాశ్వాన్.. హరియాణాలోని గురుగ్రామ్ లో వలస కూలీగా బతుకీడుస్తున్నారు. ఈ మధ్యే ఓ ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. దీంతో స్వస్థలానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఐతే ఆయన్ను సైకిల్ పై కూర్చోబెట్టుకుని బీహార్‌లోని దర్భాంగా జిల్లాకు ఏకంగా 12 వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని 7 రోజుల్లో జ్యోతి కుమారి పూర్తి చేసింది. మే 10న మొదలైన ప్రయాణం.. మే 16న ముగిసింది.
ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జ్యోతి కుమారి ఇంటర్నెట్ సంచలనంగా మారింది. ఇప్పుడు ఇవాంకా ట్రంప్ ప్రశంసలు కురిపించడంతో మరో అరుదైన గౌరవం దక్కినట్లయింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..