ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ సోదరి ర్యాండీ జుకర్‌బర్గ్ ఒక అమెరికన్ విమానంలో లైంగిక వేధింపులకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. లాస్ ఏంజిల్స్ నుండి మెక్సికోలోని మజాల్టన్ నగరానికి ఫ్లైట్‌లో ప్రయాణించిన ఆమె తన తోటి ప్రయాణికుడి నుండి వేధింపులను ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. ఎయిర్‌లైన్స్ యాజమాన్యానికి ఈమెయిల్ చేస్తూ.. ఆ కాపీని సోషల్ మీడియాలో పెట్టారు. అలస్కా ఎయిర్‌లైన్స్ ద్వారా ప్రయాణించిన ఆమెతో తన పక్క సీటులోని వ్యక్తి అసభ్య పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడారని.. తనను పదే పదే తాకడానికి ప్రయత్నించారని తెలిపారు.
అయితే ఇదే విషయాన్ని విమాన సిబ్బందికి చెబితే, ఆ ప్రయాణికుడు తరచూ ప్రయాణించే వ్యక్తని.. అతని ప్రవర్తన అలాగే ఉంటుందని.. అతని పక్కన కూర్చోవడం ఇష్టం లేకపోతే సీటు మారవచ్చని సిబ్బంది తెలిపారని ర్యాండీ చెప్పారు. అయితే ఒక వ్యక్తికి భయపడి తాను సీటు మారాలని అప్పుడు అనుకోలేదని.. ఇప్పుడు ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నానని ర్యాండీ తెలిపారు. ర్యాండీ జుకర్ బర్గ్ పెట్టిన ఫేస్‌బుక్ పోస్టు వైరల్ కావడంతో అలస్కా ఎయిర్‌లైన్స్ ఆమెకు ఫోన్ చేసి మాట్లాడింది. జరిగిన విషయాన్ని ఎంక్వయిరీ చేసి, వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని కూడా తెలిపింది
<
>