జగన్ ఆస్తుల కేసును డీల్ చేసిన సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ మనందరికీ పరిచయమున్న పేరు. ఇప్పటికే పలు సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయన రాజకీయాల్లో వస్తారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. గతంలో మీడియా అడిగిన ప్రతీసారి ఆయన సమాధానం దాటవేసే వారు. ఈ సారి మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు. శనివారం విశాఖ వచ్చిన ఆయన సీతమ్మధారలోని వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన పొలిటికల్ ఎంట్రీపై స్పందిస్తూ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతానో బాగా ఆలోచించుకున్న తర్వాతే రాజకీయాల్లోకి వచ్చే అంశంపై స్పందిస్తానని సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.
ప్రత్యేక హోదా అంశంపై లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ సందర్భగా మాట్లాడుతూ హోదా వస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని.. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇటీవలే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కు దరఖాస్తు చేసుకున్న లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తారంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్పందించిన తీరు గమనార్హం.