బ్రీటీష్ సేనలను ఎదిరించి తెలుగు ప్రజల జీవితాల్లో విప్లవ జ్యోతులు వెలిగించిన మేటి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు. 27 సంవత్సరాలకే దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఈ మేటి స్వాతంత్ర్య యోధుని సమాధి ప్రస్తుతం విశాఖపట్నం ప్రాంతంలోని క్రిష్ణదేవిపేటలో ఉండడం విశేషం. ప్రస్తుతం ఆ సమాధి ఉన్న ప్రదేశంలో ఒక చిన్న ఆలయం కట్టి, అప్పుడప్పుడు పూజాధికాలు కూడా చేస్తున్నారు కొందరు ప్రజలు. అయితే చాలా సంవత్సరాల వరకు ఈ సమాధిని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు.
గత కొంతకాలం నుండే స్థానిక ప్రజల అభిష్టం మేరకు అల్లూరి సమాధి ఉన్న ప్రాంతాన్ని పర్యాటకంగా కూడా డెవలప్ చేస్తామని చెబుతున్నారు ప్రభుత్వ అధికారులు. 1924 సంవత్సరంలో అల్లూరిని బ్రీటిష్ పాలకులు హతమార్చాక, ఆయన అనుచరులు తన భౌతికకాయాన్ని క్రిష్ణదేవీపేటకు తీసుకువచ్చి తాండవనది పక్కన దహన క్రియలు జరపడం విశేషం. విశాఖ జిల్లా పాండ్రంగి ప్రాంతంలో జన్మించిన అల్లూరి సీతారామరాజుతో పాటు ఆయన అనుచరుడు గంటం దొరకు కూడా అల్లూరి సమాధి పక్కనే సమాధిని నిర్మించడం విశేషం.
"శ్రీ సీతారామరాజు మరణించినా అతడు రగిలించిన విప్లవాగ్ని చల్లారలేదురా తమ్ముడూ! వీరుడు మరణింపడు. విప్లవానికి పరాజయం లేదు. చిందిన వీరుని రక్తం చిరకాలము ప్రవహిస్తూ ఉంటుంది" అని ఇప్పటికీ ఆ స్వాతంత్ర్య సమరయోధుడి గురించి బుర్రకథలరూపంలో కొన్ని ప్రాంతాల ప్రజలు చెప్పుకోవడం గమనార్హం. 1986లో భారత ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు సేవలకు గుర్తుగా ఒక తపాల బిళ్ళను కూడా విడుదలచేసింది