Godavari Floods: గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరికలో ఉన్న గోదావరి నదికి..రేపు చివరి మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్ని అప్రమత్తం చేశారు.
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతమైన మహారాష్ట్ర, తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. భద్రాచలం వద్ద ఇప్పటికే మూడవ ప్రమాద హెచ్చరిక దాటి..ప్రస్తుతం 62 అడుగుల ప్రమాదకరస్థాయికి చేరుకుంది. దిగువన ధవళేశ్వరంలో ప్రస్తుతం అంటే బుధవారం రాత్రి 8 గంటలకు 15 లక్షల క్యూసెక్కులు దాటి వరద ప్రవహిస్తోంది.ఇప్పటికే ధవళేశ్వరం వద్ద తొలి రెండు ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. రేపటికి వరద ప్రవాహం 18 లక్షలకు చేరువలో ఉంటుందని..ఈ సందర్భంగా రేపు మూడవ చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేయవచ్చని తెలుస్తోంది.
రేపు మూడవ ప్రమాద హెచ్చరిక
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద మరింత పెరగవచ్చని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. గోదావరి వరద పరిస్థితిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ..లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన కోనసీమ లంక గ్రామాల్ని అప్రమత్తం చేశారు. ఇప్పటికే కొన్ని లంక గ్రామాల్లో వరద నీరు చేరుకుంది. మూడవ ప్రమాద హెచ్చరిక దాటితే చాలా లంక గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే ప్రమాదముంది. రేపటికి మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితులు కన్పిస్తున్నాయి.
లంక గ్రామాల్లో సహాయక చర్యలకై ఇప్పటికే 6 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో ఉన్నాయి. లోతట్టు, లంక గ్రామాల ప్రజల సహాయార్ధం 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్స్, ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101, 08632377118 లను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
భారీ వర్షాల హెచ్చరిక
దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఫలితంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు.
Also read: Earthquake:నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook