ఇటీవలే ప్రకటించిన నంది అవార్డుల అంశంపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అవార్డుల ప్రకటనలో పక్షపాతం వహించారని..తమవారికి ఇచ్చేందుకే మొగ్గుచూపారని ఆరోపణలు వచ్చాయి. అవార్డుల విషయంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందనే కామెంట్స్ వస్తున్నాయి. 2014 ఏడాదికి గాను 'లెజెండ్' సినిమాకు ఎక్కువ అవార్డులు రావడం పట్ల కూడా కొందరు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నంది అవార్డుల జ్యూరీ సభ్యుడు ప్రసన్నకుమార్ అవార్డుల ప్రకటనపై వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ 'లెజెండ్' సినిమాకు ఉత్తమ చిత్రంగా ప్రకటించడంపై అభ్యతరం చెప్పడం సరికాదన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోనే దీన్ని ఉత్తమ చిత్రంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ సినిమా సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చిందన్నారు. భ్రూణ హత్యలను వ్యతిరేకిస్తూ ఓ సన్నివేశంలో హీరో మాట్లాడతాడరని..రాజకీయాల్లో అమ్ముడుపోతున్న ఎమ్మెల్యేల గురించి ఈ సినిమాలో చర్చ ఉందని చెప్పారు. ప్రధానంగా వీటిని పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డును ప్రకటించినట్లు పేర్కొన్నారు. అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తర్వాతే అవార్డులను ప్రకటించడం జరిగిందని..ఇందులో ఎలాంటి పక్షపాతం లేదని ప్రసన్నకుమార్ వివరణ ఇచ్చారు.