అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్ అమెరికాకు వెళ్తూవెళ్తూ.. చంద్రబాబు గారికి ఏమైనా ప్రాణహానీ తలపెట్టమని ఇక్కడున్న వారికి ప్లాన్ ఇచ్చి వెళ్లారా అని నారా లోకేష్ సందేహాలు వ్యక్తంచేశారు. ''జగన్ గారూ.. మీరు అమెరికాకు వెళ్తూ చంద్రబాబుకు ప్రాణహాని కలిగించమని మీ వాళ్లకు ప్లాన్ ఇచ్చి వెళ్లారా'' అంటూ ట్విటర్ ద్వారా నేరుగా సీఎం జగన్నే నిలదీశారు. ''జడ్ ప్లస్ కేటగిరి భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై అనుమతి లేకుండా డ్రోన్స్ ఎందుకు ఎగిరాయి'' అని ట్విటర్ ద్వారా ప్రశ్నించిన లోకేష్.. డ్రోన్‌తో ఉన్న బాక్సుల్లో ఏముందో చెప్పాలని డిమాండ్ చేశారు.
కృష్ణా నది కరకట్టకు సమీపంలో చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి పరిసరాల్లో డ్రోన్లు చక్కర్లు కొట్టడంపై తీవ్ర చర్చనియాంశమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య అనేక వాగ్వీవాదాలకు కారణమైన ఈ వివాదంపై వివిరణ ఇచ్చిన ఏపీ సర్కార్... ''కృష్ణా నది పరివాహక ప్రాంతంతోపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసేందుకు డ్రోన్లు ప్రయోగించాం" అని ప్రకటించింది.