ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పలు సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుతో ఎవరు పొత్తు పెట్టుకున్నా వారిని దారుణంగా మోసం చేసే ప్రమాదకరమైన వ్యక్తి ఆయన అని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పటికే టీడీపీ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని, ప్రాజెక్టుల నుంచి మొదలు అన్నిచోట్ల అవినీతి రాజ్యమేలుతోందని పవన్ విమర్శించారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ప్రతిచోటా రూ.వెయ్యి కోట్లకుపైగానే అవినీతి చోటుచేసుకుందని పవన్ కల్యాణ్ అన్నారు. అందుకే ఇక చంద్రబాబు రిటైర్మెంట్ తీసుకొనే సమయం దగ్గర పడిందని పవన్ ఎద్దేవా చేశారు. బుధవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చంద్రబాబు ఏకం చేస్తోన్న కూటమిలో తాను చేరబోనని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో 2014 ఎన్నికల్లో ఆయనకు మద్దతిచ్చాను కానీ ఈ ఐదేళ్లలో సీన్ మొత్తం తారుమారైందని పవన్ ఆవేదన వ్యక్తంచేశారు.
చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్‌పై సైతం పవన్ విమర్శలు ఎక్కుపెట్టారు. నారా లోకేశ్ కనీసం పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలువలేదని, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పంచాయతీరాజ్ శాఖ మంత్రిని చేశారని నారా లోకేష్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు.