Target Kuppam: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార వైసీపీతో పాటు విపక్ష పార్టీలో జోరుగా జనంలోకి వెళుతున్నాయి. గడపగడపకు ప్రభుత్వం పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరుగుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా వివిధ జిల్లాల్లో సభలు నిర్వహిస్తున్నారు సీఎం జగన్. బాదుడే బాదుడే పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది టీడీపీ. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మిని మహానాడులతో కేడర్ లో జోష్ నింపుతున్నారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కౌలు రైతులకు భరోసా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. బీజేపీ కూడా నిత్యం జనంలోనే ఉండే ప్రయత్నం చేస్తోంది.
వచ్చే ఎన్నికలపై గురిపెట్టిన వైసీపీ పక్కా ప్లాన్ తో వెళుతోందని తెలుస్తోంది. ఇటీవలే జరిగిన పార్టీ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన జగన్.. కుప్పంలో గెలవబోతున్నామని చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది. కుప్పం నుంచి వరుసుగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు. వైసీపీ హవా వీచినా గత ఎన్నికల్లో చంద్రబాబుకు భారీగానే మెజార్టీ వచ్చింది. కుప్పంను టీడీపీ కంచుకోటగా చెబుతుంటారు. అలాంటి కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని సీఎం జగన్ చెప్పడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే కుప్పంపై ఫోకస్ చేసిన సీఎం జగన్.. చంద్రబాబును ఓడించేందుకు మాస్టర్ స్కెచ్ వేశారని తెలుస్తోంది. అందుకే కుప్పం గెలుపుపై ఆయన ధీమాగా ఉన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కుప్పంపై ఫోకస్ చేశారు సీఎం జగన్. కుప్పం వైసీపీ ఇంచార్జ్ భరత్ ను ఎమ్మెల్సీ చేశారు. భరత్ ద్వారా నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కుప్పాన్ని రెవిన్యూ డివిజన్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కుప్పంలో వైసీపీ జెంగా ఎగిరింది. టీడీపీ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కుప్పం నియోజకవర్గంలో దాదాపు 70 శాతం సీట్లు వైసీపీనే గెలుచుకుంది. దీంతో కుప్పం అసెంబ్లీని గెలుచుకోవచ్చని భావిస్తున్న జగన్.. చంద్రబాబు టార్గెట్ గా పక్కాగా ప్రణాళికలు రచించారని తెలుస్తోంది. కుప్పంలో చంద్రబాబుపై పోటీకి ఎమ్మెల్సీ భరత్ ఆసక్తిగా ఉన్నా... ఇంకా బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలని జగన్ భావిస్తున్నారట. చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసిస్తున్న సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడి కుమారుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి పేరు పరిశీలనలో ఉందంటున్నారు. బలమైన బీసీ అభ్యర్థి పేరును పరిశీలించారట. అయితే తాజాగా మరోపేరు తెరపైకి వస్తోంది. అతను పోటీ చేస్తే చంద్రబాబుకు ఓడించడం ఖాయమంటున్నారు వైసీపీ నేతలు.
తమిళనాడులో టాప్ హిరోగా ఉన్న తెలుగు వ్యక్తి విశాల్ పేరును కుప్పం కోసం జగన్ సీరియస్ గా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. విశాల్ స్వగ్రామం కుప్పం నియోజకవర్గంలోనే ఉంది. ఆతని తండ్రి జీకే రెడ్డి ప్రముఖ బిల్డర్. సినీ నిర్మాతగాను ఉన్నారు. హీరో విశాల్ కు నాయకత్వ లక్షణాలు ఎక్కువే. నడిగర్ సంఘానికి ప్రెసిడెంట్ గా పని చేశారు. తెలుగు రాజకీయాలకు వస్తే విశాల్ మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబానికి మద్దతుగా ఉన్నారు. సీఎం జగన్ తో ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది. ఏపీకి జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నానని బహిరంగంగానే చెప్పారు. విశాల్ నటించిన పలు సినిమాల్లో రాయలసీమ నేపథ్యం ఉంది. పందెంకోడి సినిమా వైఎస్సార్ కోసమే తీశారని అంటారు. కుప్పం నియోజకవర్గంలో తమిళ ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. తమిళనాడులో టాప్ హీరోగా ఉన్న విశాల్ కు తమిళ ఓటర్లు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్ని బేరీజు వేసుకున్న సీఎం జగన్.. కుప్పంలో చంద్రబాబుపై విశాల్ ను రంగంలోకి దింపాలని భావిస్తున్నారని వైసీపీ వర్గాల సమాచారం. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదంటున్నారు.
కుప్పంలో 2014తో పోలిస్తే 2019లో చంద్రబాబు మెజార్టీ బాగా తగ్గింది. 2004లో 60 వేల మెజార్టీతో గెలిచిన చంద్రబాబుకు.... 2014లో 47 వేల లీడ్ వచ్చింది. 2019లో అది 30 వేలకు తగ్గింది. 2019 ఎన్నికల తర్వాత కుప్పంలో సీన్ మరింతగా మారిపోయింది. వైసీపీ బాగా బలపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. చంద్రబాబుకు కోటగా చెప్పుకునే కుప్పం మున్సిపాలిటీలో ఘన విజయం సాధించింది. స్థానిక ఫలితాలతో చంద్రబాబులో కొంత ఆందోళన పెరిగిందని తెలుస్తోంది. అందుకే ఆయన కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించారు. ఇంతకాలం కుప్పంలో బాబు సొంత ఇల్లులేదు. ఇటీవలే ఇంటి నిర్మాణం చేపట్టారు. ఓటమిభయంతోనే చంద్రబాబు ఇళ్లు కడుతున్నారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో విశాల్ ను బరిలోకి దింపితే చంద్రబాబుకు మరింతగా చెమటలు పట్టడం ఖాయమంటున్నారు. విశాల్ పోటీ చేస్తే కుప్పంలోనే చంద్రబాబు ఎక్కువ సమయం కేటాయిస్తారని వైసీపీ అంచనా. ఇది కూడా ఎన్నికల ప్రచారంలో తమకు కలిసిస్తుందని చెబుతోంది. కుప్పంలో చంద్రబాబుపై విశాల్ ను పోటీ చేయించాలన్న ప్రతిపాదనకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. వైసీపీ వర్గాలు చెబుతున్నట్లు కుప్పంలో హీరో విశాలో పోటీ చేస్తే.. చంద్రబాబుకు గండమేననే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
Read also: Kollapur Fight: తగ్గేదే లే అంటున్న జూపల్లి.. తొడగొడుతున్న హర్షవర్ధన్! పోలీస్ పహారాలో కొల్లాపూర్..
Read also: Rohit Sharma Covid 19: టీమిండియాకు బిగ్ షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.