YSRCP vs Janasena Flexi War in Visakhapatnam: 'ముఖ్యమంత్రి జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి సిబిఐ విచారణతో దేశంలో ఏపీ ప్రభుత్వం గౌరవం మంటగల్సిపోవటం, మరొక పక్క జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి పెరుగుతున్న ప్రజాదరణతో రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం, ఫ్రస్ట్రేషన్ జగన్ రెడ్డిలో పెరిగిపోయింది అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కోన తాతారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. శివ శంకర్ వ్యాఖ్యానించారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించటానికి ఆడే నాటకంలో భాగమే తప్పుడు ఫ్లెక్సీలు బహిరంగ ప్రదేశాల్లో పెట్టటం అని అన్నారు. తద్వారా ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు సృష్టించాలనే వైసీపీ ఆలోచనను ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.
సోమవారం వైజాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ పిఏసీ సభ్యులు కోన తాతారావు మాట్లాడుతూ జగన్ రెడ్డి ఆదేశాలతో పెట్టిన ఫ్లెక్సీల్లో చెబుతున్నట్లు.. జగన్, సజ్జల, విజయ సాయి, సుబ్బారెడ్డిల కంటే పెత్తందారులు ఈ రాష్ట్రంలో ఎవ్వరూ లేరని, అలాగే పవన్ కళ్యాణ్ ఎవరి పల్లకి మోయటానికి రాజకీయాల్లోకి రాలేదని.. కేవలం ప్రజల పల్లకి మోయటానికి మాత్రమే వచ్చారని తెలిపారు. జగన్ రెడ్డి తరహాలో తండ్రి శవం ఇంకా తీయకుండానే ముఖ్యమంత్రి పదవి గురించి ఎమ్మెల్యేల సంతకాలు పెట్టించేటంత అనైతిక మనిషి ఎవరూ ఉండరు అన్నారు.
పవన్ కళ్యాణ్ ని అవమానపర్చే విధంగా.. ప్రజల మధ్య పార్టీల మధ్య విభేదాలు, అల్లర్లు సృష్టించే ఫ్లెక్సీలు వైసిపి నేతలు బహిరంగ ప్రదేశాల్లో పెడుతుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తోంది అని ప్రశ్నించారు. ఈ అంశాన్ని ప్రశ్నించిన జనసేన నేతలపై స్థానిక పోలీస్ యంత్రాంగం కేసులు పెట్టటాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే వైసిపి నేతలు పెట్టిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇసుక, మద్యం, హత్యలు లాంటి అక్రమ చర్యల్లో జన సైనికులకు పరిజ్ఞానం లేదుకాని.. 24గంటల్లో జగన్ రాక్షస పాలనపై రాష్ట్రమంతా ఫ్లెక్సీలు వేయగలిగే శక్తి ఉందని స్పష్టం చేశారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ, మున్సిపల్ యంత్రాంగం ఇలాంటి ఘటనలను నిర్మూలించకుండా అధికార వైసిపి నేతలకు మద్దతుగా ఉండటాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. పోలీస్ వ్యవస్థకు గౌరవం పెంచేలా వారి చర్యలుండాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ విశాఖ నార్త్ నియోజక వర్గం ఇంచార్జి పసుపులేటి ఉషాకిరణ్, డాక్టర్ సెల్ చైర్మన్ డా.రఘు, కార్పొరేటర్లు బీశెట్టి వసంతలక్ష్మి, కందుల నాగరాజు, పార్టీ నాయుకులు డా.మూగి శ్రీనివాసరావు, శివప్రసాద్ రెడ్డి, సంకు వెంకటేశ్వర రావు, కృష్ణ పాల్గొన్నారు.