చెన్నై: దక్షిణాది ఓ ఆంగ్ల దినపత్రిక ‘వరల్డ్ ఆఫ్ ఉమెన్-2018’ అవార్డులలో భాగంగా సినీరంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతారను ఎక్స్ లెన్స్ అవార్డుతో సత్కరించింది. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ, తన తల్లిదండ్రులకు, సోదరుడికి కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాక తనకు కాబోయే భర్త విఘ్నేశ్ శివన్‌ని ప్రస్తావిస్తూ అతడికి కూడా కృతజ్ఞతలు తెలిపింది.
కాగా నయనతార తనకు కాబోయే భర్త విఘ్నేశ్ శివన్ అంటూ ప్రకటించడం ఇదే తొలిసారి. ఈ ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నాన్‌మ్ రౌడీ ధాన్ (తెలుగులో నేనూ రౌడీనే) చిత్ర షూటింగ్ సందర్భంగా ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. అయితే విఘ్నేశ్‌తో ఉంది కేవలం స్నేహం మాత్రమే అంటూ ఆమె చెప్పినప్పటికీ వారి మధ్య రిలేషన్షిప్ గురించి తర్వాత చాలా కథనాలే వచ్చాయి.
నయనతార-విఘ్నేశ్ శివన్‌ల వివాహం ఈ ఏడాది చివరిలో జరగనుందని టాక్. ప్రస్తుతం నయనతార తెలుగులో సైరాలో నటిస్తుండగా, తమిళంలో అరడజనుకు పైగా చిత్రాలు చేతిలో ఉన్నాయి.