బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఇటీవలే అలనాటి హీరోయిన్ పూజా దడ్వాల్ తన అనారోగ్యం గురించి ట్విటర్లో పోస్టు చేస్తూ.. తనకు వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవని.. అందుకే సల్మాన్ ఖాన్‌ను కలిసి సహాయం అడగాలని భావిస్తున్నానని తెలిపారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసింది. ఆమె ‘వీర్ ఘటి’ చిత్రంలో సల్మాన్‌తో కలిసి నటించారని కూడా వార్తలొచ్చాయి.
ఇటీవలే సల్మాన్ ఖాన్ ఈ విషయంపై వివరణ ఇచ్చారు. పూజా దడ్వాల్‌కు తాను తప్పనిసరిగా సహాయం చేస్తానని ఆయన అన్నారు. కాకపోతే ఆమె ‘వీర్ ఘటి’ చిత్రంలో తనతో కలిసి హీరోయిన్గా నటించలేదని.. అదే సినిమాలో ఆమె అతుల్ అగ్నిహోత్రికి జోడిగా నటించారని సల్మాన్ తెలిపారు. పలు హిందీ చిత్రాల్లో నటించిన పూజా దడ్వాల్ ఆ తర్వాత ఆ రంగం నుంచి తప్పుకున్నారు.
సినిమా రంగాన్ని వదిలేశాక పూజా దడ్వాల్, గోవాలో కాసినో మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశారు. ఆ తర్వాత ఓ కాసీనో క్లబ్బులో ఆమె మేనేజరుగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాతే ఆమెకు క్షయ వ్యాధి సోకింది. ఉన్న డబ్బంతా ట్రీట్మెంట్కే ఖర్చయిపోయింది. ఈ క్రమంలో ఆమె ట్విటర్ వేదికగా సల్మాన్‌ని సహాయం అడిగారు. తన పరిస్థితిని వివరించారు.
ఆమె పరిస్థితిని తెలుసుకొని ఇటీవలే నటుడు రవికిషన్ కొంత మొత్తాన్ని ఆమెకు అందించారు. పూజా దడ్వాల్ సల్మాన్‌ను సహాయం అడిగాక.. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా హల్చల్ చేసింది. సల్మాన్ అభిమానుల నుండి ఆయనకు అనేక వినతులు కూడా వచ్చాయి. పూజను ఆదుకోమని అనేకమంది ఆయనను కోరారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తాను తప్పకుండా ఆమెకు సహాయం చేస్తానని ఇటీవలే తెలిపారు.