ప్రభుత్వోద్యోగులకు 7వ పే కమిషన్ సిఫార్సుల కంటే అధిక మొత్తంలో జీతాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్న వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. ఉద్యోగులకు జీతాలు పెంచడం లేదని తెలిపింది. 7వ పే కమిషన్ లేదా 7వ సీపీసీ సిఫారసుల మేరకే కనీస వేతనాలు, ఫిట్మెంట్ పెరుగుదల ఉంటుందని వెల్లడించింది.
సమాజ్వాది పార్టీ ఎంపీ నీరజ్ శేఖర్ - '7వ పే కమిషన్ సూచించిన అత్యల్ప పెరుగుదలతో ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహానికి గురయ్యారు. వారి కనీస వేతనాన్ని రూ .18,000 నుండి రూ.21,000, ఫిట్మెంట్ను 2.57 నుండి 3 వరకు పెంచాలని ఆలోచిస్తున్నారా?' అని అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి రాధాకృష్ణన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
రాజ్యసభలో ప్రశ్నకు సమాధానంగా, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి.డి. రాధాకృష్ణన్ మాట్లాడుతూ- '7 వ పే కమిషన్ సిఫారసుల మినహా కనీస వేతనాలు, ఫిట్మెంట్ లను పెంచడం లేదు. 7 వ సెంట్రల్ పే కమిషన్ యొక్క నిర్దిష్ట సిఫార్సులు ఆధారంగా కనీస వేతనం నెలకు రూ .18,000, 2.57 ఫిట్మెంట్ ఉంటుంది. కమిషన్ సంబంధిత అన్ని అంశాలను ఆధారంగా చేసుకొనే సిఫార్సులు చేసి ఉంటుంది. అందువల్ల ఎటువంటి మార్పులూ పరిశీలనలో లేవు 'అని అన్నారు.
7వ పే కమిషన్ సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పేలో 14.27 శాతం పెంపును సూచించింది. దీంతో వారి కనీస వేతనం రూ .7,000 నుంచి రూ .18,000కు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మధ్య ఆగ్రహానికి గురైనప్పటికీ, 7వ పే కమిషన్ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వోద్యోగులు కనీస వేతనం 18,000 రూపాయల నుండి 26,000 రూపాయలు, ఫిట్మెంట్ కారకాన్ని 2.57 నుండి 3.68కి పెంచాలని డిమాండ్ చేశారు.
కనీస వేతనం రూ.21,000, ఫిట్మెంట్ కారకం 3.00లకు పెంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వార్తలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ, అటువంటి ప్రతిపాదనను పరిగణించటం లేదని ప్రభుత్వం ఇప్పుడు స్పష్టంగా వివరించింది.