బ్యాంకు ఖాతాలకు ఆధార్ తప్పనిసరే

    

Last Updated : Oct 21, 2017, 07:14 PM IST
బ్యాంకు ఖాతాలకు ఆధార్ తప్పనిసరే

బ్యాంకు ఖాతాలతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి ఆధార్ అనుసంధానం చేయడం తప్పనిసరి. ఇదే విషయాన్ని ఈ రోజు భారతీయ రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. ఇటీవలే ఓ సమాచార హక్కు దరఖాస్తుకు జవాబిచ్చిన ఆర్బీఐ, బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయాలని తాము ఆదేశాలను జారీ చేయలేదని పేర్కొంది.

ఈ ఆదేశాల నిమిత్తం ఈ రోజు మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించిన ఆర్బీఐ మళ్లీ ఓ ప్రకటన విడుదల చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం రెండవ సవరణ నిబంధనలు, 2017 ప్రకారం బ్యాంకు ఖాతాలకు ఆధార్ జతచేయాలని తెలిపింది. అయితే ఇదే అంశంపై ఆర్బీఐ ప్రత్యేకంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని పేర్కొంది.

అయితే జూన్ 1 నుండే ఈ నిబంధనలు అమలులోకి వచ్చినందున అవి అమలు చేయడం తప్పనిసరి అని తెలిపింది. ఈ నిబంధనలు అందరికీ ఒక్కటేనని, ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాకు జతచేయడం అవసరమేనని తెలిపింది. అందుకోసం తదుపరి ఆదేశాల కోసం బ్యాంకులు ఆర్బీఐ ఆదేశాల కోసం ఎదురు చూడనవసరం లేదని, ఈ నిబంధనలు బ్యాంకు వినియోగదారులందరికీ వర్తిస్తాయని అభిప్రాయపడింది. 

మనీలాండరింగ్ నిరోధక చట్టం రెండవ సవరణ నిబంధనలు, 2017 ప్రకారం బ్యాంకు వినియోగదారులు అందరూ ఈ సంవత్సరం డిసెంబరు 31లోగా ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసుకోవాలి. ఒకవేళ అలా చేసుకోనట్లయితే.. ఆ బ్యాంకు ఖాతాలు లావాదేవీల నిర్వహణకు తగినవి కాదని ప్రకటించడం జరుగుతుంది.

Trending News