ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ఉత్తర్ ప్రదేశ్లోని బనారస్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైవేపై ఓ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. 87 కిమీ మైలురాయి వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. క్షతగాత్రులను ఇటావాలోని సైఫై ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కర్హల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ అజయ్ శంకర్ రాయ్ ఘటనాస్థలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై తరచుగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు ఆ రహదారిలో ప్రయాణించేవారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.