ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చిల్లీ పౌడరుతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. తొలుత వినతి పత్రం సమర్పించడానికి సీఎం ఆఫీసు ప్రాంగణంలోకి వచ్చిన ఆ వ్యక్తి.. దానిని సీఎంకు అందించాడు. తర్వాత పాదాలకు వందనం చేస్తున్నట్లు నటిస్తూనే జేబులో నుండి చిల్లీ పౌడర్ తీసి సీఎం ముఖానికి పూయడానికి ప్రయత్నించాడు. అయితే.. సెక్యూరిటీ అధికారులు వేగంగా స్పందించడంతో ఆ వ్యక్తిని నియంత్రించడం సాధ్యమైంది. తర్వాత ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వ్యక్తిని 40 సంవత్సరాల అనిల్ కుమార్ శర్మగా గుర్తించారు. ఆ వ్యక్తి కేజ్రీవాల్‌ని కలవడానికి వచ్చినప్పుడు.. సీఎం లంచ్ బ్రేక్‌కి వెళ్లాల్సి ఉంది. ఈ ఘటన సీఎం ఆఫీసు థర్డ్ ఛాంబర్ బయట జరిగింది. ఈ ఘటన పై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి అల్కా లాంబా మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీస్ అధికారులు సీఎం రక్షణ విషయంలో అశ్రద్ధగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం సూచనల మేరకే వారు పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు.
అయితే ఈ ఘటన జరిగాక.. ఢిల్లీ బీజేపీ యూనిట్ తరఫున మనోజ్ తివారీ మాట్లాడారు. తాము ఈ దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేసి.. కారకులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. బీజేపీకీ ఈ దాడికి ఏం సంబంధం లేదని ఆయన తెలిపారు.