ముగిసిన రాజ్యసభ పోలింగ్: ఎన్డీయే జయభేరి

దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో 59 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్డీయే కూటమి జయభేరి మోగించింది. బీజేపీ 28 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్‌ 10 చోట్ల విజయం సాధించింది.

Last Updated : Mar 24, 2018, 04:06 PM IST
ముగిసిన రాజ్యసభ పోలింగ్: ఎన్డీయే జయభేరి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో 59 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్డీయే కూటమి జయభేరి మోగించింది. బీజేపీ 28 స్థానాల్లో గెలుపొందింది. తద్వారా పెద్దల సభలో బీజేపీ పార్టీ బలం పెరిగింది. కాంగ్రెస్‌ 10 చోట్ల విజయం సాధించింది.

శుక్రవారం ఆరు రాష్ట్రాల్లో 26 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 10 రాష్ట్రాల్లో 33 స్థానాలు ఏకగ్రీవం కాగా,  కేరళలో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఉత్తర ప్రదేశ్‌, కర్నాటకలో క్రాస్‌ఓటింగ్‌ ఆరోపణల నేపథ్యంలో లెక్కింపు కొద్దిసేపు నిలిపివేసి, ఆ తర్వాత మళ్లీ కొనసాగించారు. మొత్తం 10 సీట్లకు గానూ యూపీలో బీజేపీ తొమ్మిదింటిని కైవసం చేసుకుంది.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగ్గా, సాయంత్రం 5 గంటల నుంచి లెక్కింపు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, కర్నాటక, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ నెలకొనడంతో ఎన్నికలు నిర్వహించారు. తెలంగాణలో మూడు స్థానాలలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది. ఆ పార్టీ నుంచి సంతోష్‌ కుమార్‌, లింగయ్య యాదవ్‌, బండి ప్రకాశ్‌ ముదిరాజ్‌ గెలుపొందారు.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవం అయింది. తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలు, వైకాపా ఒక స్థానం దక్కించుకున్నాయి. తెదేపా నుంచి సీఎం రమేష్‌, కె.రవీంద్ర కుమార్‌ పెద్దల సభకు ఎన్నికవ్వగా, వైకాపా నుంచి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి రాజ్య సభకు ఎన్నికయ్యారు.

తృణముల్ కాంగ్రెస్-4, బీజేడీ-3, ఆర్జేడీ-2, జేడీ(యూ)-2, ఏఐటీసీ-4, ఇతరులు-4 స్థానాలను గెలుచుకున్నారు. కాగా పశ్చిమ బెంగాల్‌లో ఐదు స్థానాలకు ఎన్నికలు జరగ్గా, నాలుగు స్థానాల్లో తృణముల్ కాంగ్రెస్ గెలిచింది.

2014 సాధారణ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ సాధించినప్పటికీ, రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. అయితే, గత నాలుగేళ్లలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ఇప్పుడు రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

 

Trending News