బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కొత్తగా అలీగఢ్ ప్రాంతానికి మేయర్గా ఎన్నికైన మహమ్మద్ ఫర్కన్ మాట్లాడుతూ తనకు "జనగణమన" పాడడం రాదని తెలిపారు. తాను ఈ గీతానికి గౌరవం ఇస్తానని.. కానీ తాను ఈ గీతాన్ని పాడలేనని అన్నారు. ఫర్కన్ మేయర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు హిందీలో కాకుండా ఉర్దూలో ప్రమాణం చేయడం కూడా వివాదాస్పదమైంది.
డిసెంబరు 2017లో మీరట్ మేయర్ సునీతా వర్మ కూడా అచ్చం ఇలాగే ప్రవర్తించారు. జిల్లాలో మేయర్ ఆధ్వర్యంలో జరిగే బోర్డు మీటింగ్స్ ప్రారంభానికి ముందు జాతీయ గేయమైన వందేమాతరాన్ని పాడాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. తమ మున్సిపల్ బోర్డు నియమాలు ప్రకారం వందేమాతరానికి బదులుగా జనగణమన పాడాలని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇక అలీగఢ్ మేయర్ విషయానికి వస్తే, ఆయన తనకు జాతీయ గీతం కనీసం పాడడం కూడా రాదని చెప్పారు. 2017లో జరిగిన యూపీ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజీవ్ అగర్వాల్ పై 11990 ఓట్ల తేడాతో గెలిచిన ఫర్కన్ అలీగఢ్ ప్రాంతానికి ఎన్నికైన తొలి ముస్లిం మేయర్ కావడం గమనార్హం