దాణా కుంభకోణంలో కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా ప్రకటించిన కొద్దిసేపటికే.. లాలూ కుమార్తె మీసా భారతిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. ఆవిడతో పాటు భర్త శైలేష్ పేరును కూడా చార్జిషీట్ లో పేర్కొనింది. వందల కోట్ల రూపాయల మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై అభియోగపత్రాలను పాటియాలా కోర్టుకు సమర్పించింది. ఈ కేసు జనవరి మొదటివారంలో విచారణకు రానుంది.
ఫేక్ కంపెనీలను సృష్టించి మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై మీసా భారతి చార్టెడ్ అకౌంటెంట్ రాకేష్ అగర్వాల్ పేరును ఈడీ ఇదే ఏడాది జులైలో చార్జిషీట్ లో చేర్చింది. ఆగస్టులో మీసా, ఆమె భర్త శైలేష్ కు ఈడీ సమన్లు జారీచేసి, విచారణకు హాజరుకావాలని పేర్కొనింది. ఢిల్లీలో వందల కోట్ల విలువచేసే స్థలాన్ని కేవలం కోటి ఇరవై లక్షలకు కొనుగోలు చేశారని రాజ్యసభ సభ్యురాలు మీసా, ఆమె భర్త శైలేష్ పై ఆరోపణలు ఉన్నాయి. షెల్ కంపెనీ పేరిట ఢిల్లీ, పాట్నాలలో లాలూ కుటుంబసభ్యులు అక్రమంగా ఆస్తులు కూడబెడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటోంది. తాజాగా ఐటీ శాఖ ఈ కేసును విచారిస్తోంది. డిసెంబర్ మొదటివారంలో ఈడీ మీసాను ప్రశ్నించింది. ఢిల్లీలోని ఆమె, ఆమె భర్తకు చెందిన నివాసాల్లో సోదాలు నిర్వహించింది కూడా.