సెప్టెంబరు తొలివారంలో బ్యాంకులకు వరుస సెలవులు అంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ రెండో శనివారం (సెప్టెంబర్ 8), ఆదివారం మాత్రమే సెలవు అని, మిగితా అన్ని రోజుల్లో బ్యాంకులు తన కార్యకలాపాలను నిర్వహిస్తాయని.. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొంది. అన్ని రాష్ట్రాల్లోని ఏటీఎంలలో విరివిగా నగదు నిల్వలు ఉన్నాయని తెలిపింది. నగదు నిల్వలు లేని పక్షంలో తగిన చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకులను ఆర్థిక శాఖ ఆదేశించింది.
అంతకు ముందు జాతీయ బ్యాంక్ ఉద్యోగుల సంఘం నేతలు ఈ వార్తపై స్పందించారు. బ్యాంకులకు ఆరో రోజులు సెలవులు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజంలేదని బ్యాంక్ ఉద్యోగుల సంఘం నేతలు చెప్పారు. 4, 5 తేదీల్లో సమ్మె చేపట్టనుంది కేవలం రిజర్వు బ్యాంక్ ఉద్యోగులు మాత్రమే అని, ఈ సమ్మెవల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులన్నీ యథావిధిగా పనిచేస్తాయని పేర్కొన్నారు.
హైదరాబాద్లో కొత్త రూ.100 నోటు
అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన కొత్త రూ.100 నోటు కోసం హైదరబాద్ నగరవాసులు క్యూ కట్టారు. ఉదయం 7 గంటల నుంచే హైదరాబాద్లోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి పెద్దసంఖ్యలో ప్రజలు వచ్చి.. క్యూలో నిలబడి కొత్త రూ.వంద నోట్లను తీసుకున్నారు. కొత్త వంద నోటు తీసుకున్నాక పలువురు బయట వాటితో సెల్ఫీలు దిగడం కనిపించింది.