లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఓ బ్యాంకులో 1700 మంది నమోదు చేసుకున్న జన్‌ధన్ ఖాతాల్లో ఖాతాదారుల ప్రమేయం లేకుండానే రూ.10 వేలు నగదు జమ అవడం సంచలనం సృష్టించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం చొరవతో ఇచ్చిన జన్ ధన్ ఖాతాల్లో ఇలా కేంద్రమే డబ్బులు జమ చేస్తోందనే వదంతులు వ్యాపించడం మరింత సంచలనం రేపింది. అలా జన్‌ధన్ ఖాతాల్లో జమ అయిన నగదు మొత్తం రూ.1.7 కోట్లుగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
తొలి విడత లోక్ సభ ఎన్నికలకు మరో వారం రోజులే మిగిలి వుందనగా చోటుచేసుకున్న ఈ పరిణామం బీజేపి, కాంగ్రెస్ మధ్య రాజకీయ దుమారానికి కారణమైంది. ఇది ముమ్మాటికి నోటుకు ఓటు వ్యవహారమే అవుతుందంటూ ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ... ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి వేసిన ఎత్తుగడగా దీనిని అభివర్ణించింది. అయితే, ఈ పరిణామంపై స్పందించిన బీజేపీ.. జన్ ధన్ ఖాతాల్లో రూ.10 వేలు జమ కావడానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఖాతాదారులకు తెలియకుండానే వారి ఖాతాల్లో నగదు ఎలా జమ అయింది ? ఎవరు జమ చేశారనే కోణంలో దర్యాప్తు చేపట్టిన ఐటి శాఖ అధికారులు.. బ్యాంకు ప్రతినిధులే ఆ మొత్తాన్ని జమ చేశారని నిగ్గు తేల్చినట్టు తెలుస్తోంది.