ఇంకొద్ది రోజులలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో స్మార్ ఫోన్ల రేట్లు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ ప్రభావం హైఎండ్ మొబైల్ ఫోన్లపై పడే అవకాశం నూటికి నూరు శాతం ఉందని అంటున్నారు. అలాగే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లేల పై కూడా కస్టమ్ డ్యూటీలు వసూలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అలాగే దిగుమతులు చేసుకొనే విదేశీ స్పేర్ పార్ట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలపై కూడా కస్టమ్ డ్యూటీని భారీస్థాయిలో పెంచే అవకాశం ఉందని ఈ రంగంలో పనిచేస్తున్న పలువురు అంటున్నారు. ముఖ్యంగా ఎగుమతులకు పెద్దపీట వేయాలన్ని కారణంతో పాటు స్థానిక ఎలక్ట్రానిక్ సంస్థలను ప్రోత్సహించేందుకు ఇలాంటి నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోనుందని కూడా వార్తలు వస్తున్నాయి. గత సంవత్సరం ప్రభుత్వం స్మార్ ఫోన్లపై 15 శాతం ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ వేసింది. ఆ శాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయన్నది నిపుణుల అంచనా.