AP Govt Appoints Judicial Enquiry On Tirupati Temple Stampede: దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం రేపిన తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమల తిరుపతి చరిత్రలోనే అత్యంత ఘోర సంఘటన ఈ ఏడాది జనవరి 8వ తేదీన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు.
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సమయంలో తిరుపతిలో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు.
ఇప్పటికే ఈ ఘటనపై తీవ్ర రాజకీయ దుమారం ఏర్పడగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
తిరుపతి తొక్కిసలాటపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. న్యాయ విచారణకు రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. నిజనిజాలు వెల్లడయిన తర్వాత ఈ దుర్ఘటనలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
తొక్కిసలాట ఘటనలో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలి కానీ.. అధికారులపై కాదని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో నియమించిన న్యాయ విచారణపై కూడా విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది.