AP TS Cold Wave: తెలుగు రాష్ట్రాల ప్రజలను చలి వణికికొస్తోం. అంతేకాదు చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గత నెలరోజుల నుంచి తగ్గుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఇంకా పడిపోతున్నాయి. ఈ ఏడాది గతం కంటే దారుణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి పెరిగిపోయింది.
AP TS Cold Wave: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలితో ఏజెన్సీలో ప్రజలు వణుకుతున్నారు. సాయంత్రం నుంచే చలిగాలులు వీస్తున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తోంది. రాత్రి సమయంలో చలిప్రభావం మరింత అధికంగా ఉంటుంది.
చలి కారణంగా పొగ మంచుతో ఉదయం పూట దారులు కనపటడం లేదు. దీంతో పలు చోట్ల వాహన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఏపీలో విశాఖ ఏజెన్సీతోపాటు రాయలసీమ రీజియన్లోనూ చాలాచోట్ల 12 నుంచి 20 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
గతం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత మరింత పెరిగింది. రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీలకు మించడం లేదు.
అటు అరకులోయలో 8.2 డిగ్రీలు, జి.మాడుగుల 9, డుంబ్రిగుడ 9.2, అనంతగిరి 9.5, జీకే వీధి 9.8, పాడేరు మండలం మినుములూరు 10, హుకుంపేట 10.5, చింతపల్లి 10.6, కొయ్యూరు 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరోవైపు తెలంగాణలోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ ఆదిలాబాద్లో కనిష్ఠంగా 8.2 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. మెదక్లో 10, పటాన్ చెరులో 12.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి.
దట్టమైన పొగ మంచులో వాహనాలు వెళ్లేందుకు దారులు కనిపించడంలేదు. చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటలు దాటితే గానీ మంచు వీడటం లేదు. చలికి చల్లగాలులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు, చిన్నారులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఉద్యోగాలకు వెళ్లేవారు, రైతులు, కార్మికులు, ఇతర పనులు చేసుకునేవారు సైతం బయటకు వెళ్లడానికి జంకుతున్నారు.