National Pension System Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే డీఏ పెంపునకు సంబంధించిన గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉండగా.. ఈలోగా మరో వార్త తెరపైకి వస్తోంది. పాత పెన్షన్ స్కీమ్ (OPS)ను తిరిగి తీసుకువచ్చే ఉద్దేశం లేదని కేంద్ర ఇప్పటికే స్పష్టం చేయగా.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో కీలక మార్పులను చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. OPS, NPS మధ్య వ్యత్యాసాలను తొలగించేందుకు, ఉద్యోగుల్లో అసంతృప్తిని తగ్గించేందుకు కేంద్రం మార్పులు చేయనున్నట్లు సమాచారం.
as
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తుండగా.. ఇది కుదరదని కేంద్రం తేల్చేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌పీఎస్‌లోనే మార్పులు చేయాలని భావిస్తోంది.
తాజా మార్పులతో ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ కింద లభించే ప్రయోజనాలనే కలుగుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తాము చివరి జీతం ఎంత అందుకున్నారో.. అందులో 50 శాతం పెన్షన్‌గా చెల్లించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి.
ఇప్పటికే పెన్షన్ సమస్యలపై ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ కమిటీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఎన్‌పీఎస్ కింద పెన్షన్ గ్యారెంటీ, సంబంధిత ఆర్థిక చిక్కులను పరిశీలిస్తోంది. అంతర్జాతీయ పెన్షన్ వ్యవస్థలను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షన్ విధానాన్ని కూడా ఈ కమిటీ పరిశీలించింది.
ఆంధ్రప్రదేశ్ గ్యారెంటీడ్ పెన్షన్ సిస్టమ్ (APGPS) చట్టం, 2023 ప్రకారం.. యాన్యుటీ తక్కువగా ఉన్న సందర్భాల్లో టాప్-అప్‌తో చివరిగా డ్రా చేసిన బేసిక్ పేలో 50 శాతం నెలవారీ పెన్షన్‌ను ఉద్యోగులు అందుకోవచ్చు. అదేవిధంగా ఉద్యోగి మరణిస్తే.. అతని జీవిత భాగస్వామికి హామీ మొత్తంలో 60 శాతం నెలవారీ పెన్షన్‌గా అందుతుంది.
పాత పెన్షన్ స్కీమ్ ప్రకారం.. ఉద్యోగులు వారి చివరి జీతంలో 50 శాతం పెన్షన్‌గా పొందుతారు. అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో ఉద్యోగులు తమ బేసిక్ జీతంలో 10 శాతం పెన్షన్ కోసం జమ చేస్తారు. ఇందుకు ప్రభుత్వం 14 శాతం జమ చేస్తుంది.
ఎన్‌పీఎస్ కాంట్రిబ్యూటరీ స్కీమ్ కాబట్టి.. పెన్షన్‌లో హెచ్చుతగ్గులు ఉంటాయి. 25-30 ఏళ్ల సర్వీసు ఉన్న ఉద్యోగులు ఎన్‌పీఎస్ కింద మంచి ఆదాయం ఆర్జించే అవకాశం ఉంటుంది. కానీ తక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులు తక్కువ మొత్తంలో అందుకుంటారు.
ఈ నేపథ్యంలో ఆర్థిక స్థిరత్వం కోసం ప్రత్యేక నిధిని రూపొందించే ప్రణాళికను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. పెన్షనర్లకు మెరుగైన భద్రత, ఆర్థిక బాధ్యత మధ్య సమతుల్యతను అందించాలని భావిస్తోంది.
ఎన్‌పీఎస్‌లో మార్పులతో ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ మార్పులను ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందో ఇంకా క్లారిటీ లేదు.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందించినది. ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు.. ఆర్థిక నిపుణులను సంప్రదించండి. ఎన్‌పీఎస్ గురించి కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.