Who Is Sagar Adani What Is Link With Gautam Adani Fraud Allegations: ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మోసం.. లంచం అనే ఆరోపణలతో అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. దానికి కారణం ఓ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? అతడికి గౌతమ్ అదానీకి సంబంధం ఏమిటి? అనేవి తెలుసుకుందాం.
అతడే కారణం: గౌతమ్ అదానీ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్‌పై మోసం ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పరువు పోయింది. అదానీ గ్రూప్‌పై ఇంతటి ఆరోపణలు రావడానికి కారణం సాగర్ అదానీ. ఆర్థిక శాస్త్రంలో పట్టా, అదానీ గ్రీన్ ఎనర్జీలో కీలక పాత్రతో సాగర్ అదానీ సామ్రాజ్యంలో కీలక వ్యక్తిగా ఉన్నాడు.
ఎవరు అతడు? సాగర్ అదానీ ఎవరో కాదు గౌతమ్ అదానీ సోదరుడు రాజేశ్ అదానీ కుమారుడు. బ్రౌన్ యూనివర్శిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టభద్రుడయ్యాక 2015లో అదానీ గ్రూప్‌లో చేరాడు. అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నాడు.
అదానీ గ్రూపులో కీలకం: సాగర్ అదానీ సంస్థకు సంబంధించిన సౌర, పవన విద్యుత్‌ను విస్తరించిన ఘనత సాగర్‌కు దక్కుతుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ పునరుత్పాదక శక్తిలో అగ్రగామిగా మారడానికి సాగర్ నాయకత్వం అత్యంత కీలకం.
వారసత్వం: గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యానికి నలుగురు వారసుల్లో సాగర్ అదానీ కూడా ఒకడు. గౌతమ్ అదానీ కుమారులు కరణ్ అదానీ, జీత్ అదానీతోపాటు మరో వ్యక్తి ప్రణవ్ అదానీ, సాగర్ అదానీకి వ్యాపారాల్లో వాటాలు ఉన్నాయని సమాచారం.
ఆరోపణలు ఇవే! సాగర్ అదానీ, గౌతమ్ అదానీ మరికొందరు మోసానికి తెరలేపారని అమెరికా న్యాయ శాఖ ఆరోపించింది. భారతదేశపు అతిపెద్ద సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్టులను పొందేందుకు వారు 265 మిలియన్ డాలర్ల లంచాలు ఇచ్చారని ఆరోపణలు బయటకు వచ్చాయి.
భారీ లక్ష్యం: 750 మిలియన్ డాలర్ల బాండ్ ఆఫర్ సమయంలో నిందితులు పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడంతోపాటు పెట్టుబడిదారుల నుంచి 175 మిలియన్ డాలర్లు సేకరించారని ఆరోపణలు వచ్చాయి. దీనివలన రెండు దశాబ్దాలలో 2 బిలియన్ డాలర్ల లాభాలను ఆర్జించాలని లక్ష్యంగా ప్రణాళిక రచించారు.