Zomato Top Loser Today: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో షేర్లు మంగళవారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒక్క రోజులోనే 10శాతానికిపైగా షేర్లు పడిపోయాయి. ఈ ప్రభావం మరో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీపై కూడా పడింది. ఆ సంస్థ షేర్లు కూడా పడిపోతున్నాయి. దీనికి ఓ ప్రధాన కారణం ఉంది. అదేంటో చూద్దాం.
Zomato Top Loser Today: ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ఫామ్ జొమాటో షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. డిసెంబర్ లో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఫలితాల నేపథ్యంలోనే జొమాటో షేర్లు పడిపోతున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. మరో ఫుడ్ డెలివరీ సంస్థపైనా ఈ ప్రభావం కనిపిస్తోందని చెబుతున్నారు. దీంతో రెండె కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆ వివరాల గురించి తెలుసుకుందాం.
ప్రస్తుత ఆర్థిక ఏడాది 2024-25కి సంబంధించి మూడో త్రైమాసిక ఫలితాలను జొమాటో ప్రకటించింది. క్యూ3లో కంపెనీ నికర లాభం రూ. 59కోట్లుగా చూపించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభంలో 57.2శాతం క్షీణత నమోదు అయ్యింది. అయితే అందుకు గల కారణాలను కూడా వివరించింది.
క్విక్ కామర్స్ ఫ్లాట్ ఫామ్ బ్లింకిట్ ఆర్డర్లను త్వరితగతిన పూర్తి చేసుకునేందుకు వేగంగా స్టోర్ల విస్తరణ చేపట్టిన క్రమంలో తమ లాభం తగ్గినట్లుగా తెలిపింది. స్టోర్ల విస్తరణ కోసం పెట్టుబడులు పెంచడం వల్ల వచ్చే త్రైమాసికాల్లోనూ నష్టాలు నమోదు కావచ్చని పేర్కొంది.
దీంతో ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు టార్గెట్ ధరను కూడా తగ్గించాయి. దీంతో కంపెనీ షేర్లు ఒక దశలో 10శాతం మేర పడిపోయాయి. ప్రస్తుతం ఈ జొమాటో స్టాక్ 8.61 శాతం నష్టంతో రూ. 219 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ 52వారాల గరిష్ట ధర రూ. 304 వద్ద ఉండగా కనిష్ట ధర రూ. 127 వరకు ఉంది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.93 లక్షల కోట్లుగా ఉంది.
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ షేర్లు కూడా మంగళవారం 10శాతం పడిపోయాయి. గత నాలుగు సెషన్లలో లాభాల్లో ట్రేడ్ అయిన స్విగ్గీ నేడు భారీగా పడిపోయింది. స్టాక్ మార్కెట్లోకి లిస్టయిన తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు.
జొమాటో ఫలితాలు బలహీనంగా నమోదు కావడం స్విగ్గీ షేర్లపై ప్రభావం చూపిస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో స్విగ్గీ షేర్లు 8వారాల కనిష్ట స్థాయి రూ. 427ను తాకాయి. కాగా ఈ రోజు స్విగ్గీ షేరు ధర 7.70 శాత నష్టంతో రూ. 442 దగ్గర ట్రేడ్ అవుతోంది.