Most Expensive Mangoes: మామిడి పండ్లు.. ఈ పేరు వింటే చాలు.. ఏదో తెలియని ఫీలింగ్ నోరు ఊరేలా చేస్తుంది. ఎండా కాలం అంటేనే మామిడి పండ్లు గుర్తుకొస్తాయి.. హాట్ హాట్ సమ్మర్ సీజన్ లో మామిడి పండ్లతో సేదతీరడం అంటే నచ్చని వాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి.. అందుకే మామిడి పండ్లను పండ్లలోనే రారాజు అని కూడా పిలుస్తారు. మామిడి పండ్ల గురించి ఇదంతా ఒక ఎత్తయితే.. ప్రపంచంలో కొన్ని రకాల మామిడి పండ్ల ధరలు కిలో మామిడి పండ్ల ధర లక్షల్లో పలుకుతాయి అని తెలుసా ? ఇంతకీ అంత ఖరీదైన ఆ మామిడి పండ్లు ఎక్కడ పండిస్తారు, ఎంత ఖరీదు ఉంటాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.
మియాజకి మామిడి పండ్లు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ మామిడి పండ్ల రకం పేరు మియాజకి మామిడి పండ్లు అంటారు. ఇవి జపాన్‌లో మాత్రమే పండిస్తారు. ఒక్క కిలో మియాజకి మామిడి పండ్ల ధర రూ. 2 లక్షల నుంచి రూ. 2.70 లక్షలు వరకు ఉంటుంది. చూడ్డానికి ఈ మామిడి పండ్లు ఎంతో అందంగా, ఆకట్టుకునే వర్ణంలో ఉంటాయి.
కోహితూర్ మ్యాంగో..
ఇండియాలో అత్యంత ఖరీదైన మామిడి పండ్లలో కోహితూర్ మ్యాంగో కూడా ఒకటి. ఇది ఒక్కో మామిడి పండు ధర రూ. 1500 వరకు పలుకుతుంది. మన దేశంలో పండించే మామిడి పండ్ల రకాల్లో ఇదే అత్యంత ఖరీదైన రకం.
ఆల్ఫాన్సో మామిడి పండ్లు... మామూలుగానే మామిడి పండ్లను పండ్లలో రారాజుగా పిలుస్తుంటారు. అందులోనూ ఆల్పాన్సో మామిడి పండ్ల లెవెలే వేరు. ఒక్కో కిలోకు రూ. 300 నుంచి 400 రూపాయల వరకు ధర పలుకుతుంది.
పాకిస్థాన్‌కి చెందిన సింధరి మామిడి పండ్లకు కూడా అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇవి కూడా ఒక్కో కిలోకు రూ. 300 నుంచి రూ. 400 వరకు కూడా ధర పలుకుతున్నాయి.
నూర్జహాన్ మామిడి పండ్లు కూడా అత్యంత ఖరీదైన రకం మామిడి పండ్లు. ఇవి కూడా ఒక్కో మామిడి పండు రూ. 500 నుంచి రూ. 1000 వరకు పలుకుతున్నాయి. ముఘల్ సామ్రాజ్యాధినేత జహంగీర్ భార్య పేరుపై ఈ మామిడి పండ్లకు నామకరణం చేయడం ఆశ్చర్యానికి గురిచేసే మరో అంశం. ఈ మామిడి పండ్లకు ఆ పేరు ఎలా వచ్చిందంటే, దాని వెనుక కూడా రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ.. సరైన కారణం మాత్రం ఎవ్వరికీ తెలియదు.
ఫిలిప్పీన్స్‌లోని తోటల్లో పండించే కారాబావో మామిడి పండ్లకు కూడా మంచి పేరుంది. కాకపోతే ఇవి కిలోకు మరీ అంత ఎక్కువ ఖరీదు కాకుండా రూ. 150 నుంచి రూ. 200 వరకు ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న మామిడి పండ్లలో ఎక్కువ శాతం చల్లటి ప్రదేశాల్లో పండించేవే కావడం ఇంకో విశేషం. అంతేకాకుండా సేంద్రీయ వ్యవసాయ పద్దతుల్లో ఈ మామిడి పండ్ల తోటల పెంపకం జరుగుతుంది. అందుకే ఈ మామిడి పండ్లకు అంత ఎక్కువ డిమాండ్.. అంత ఎక్కువ ఖరీదు..