Telangana Assembly Elections: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. అయితే సీఎం కేసీఆర్ మాత్రం ముందస్తు ముచ్చటే లేదు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని చెబుతూ వస్తున్నారు. కానీ పార్టీ కార్యక్రమాలతో పాటు పాలనలో దూకుడు పెంచారు. దీంతో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. జోరు మీదున్న బీజేపీకి అడ్డుకట్ట వేయాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మార్గమని గులాబీ అధినేత భావిస్తున్నట్లు సమాచారం.
వీలైనంత త్వరగా ముందస్తుకు వెళ్లాలని ఆయన యోచిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుండటం.. 9 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఏ క్షణాన్నయినా అసెంబ్లీని రద్దు చేయాలని కేసీఆర్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. కీలక నేతలను పార్టీలోకి రప్పించేందుకు ప్లాన్ చేస్తోంది. శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. త్వరలోనే మరికొందరు నేతలు బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ నేతలు కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలతో టచ్‌లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.
షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్ వరకూ ఆగితే ఈలోపు బీజేపీ రాష్ట్రంలో పలువురు నేతలను తమవైపు తిప్పుకునే అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ ఛాన్స్ బీజేపీకి ఇవ్వకూడదనే ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారని టాక్ వస్తోంది.
కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలని భావించడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు. షెడ్యూల్ ప్రకారం 2023 డిసెంబర్ వరకు తెలంగణ అసెంబ్లీకి గడువు ఉంది. అయితే అప్పటివరకు ఆగితే 2024 మేలో సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే యోచనలో బీజేపీ ఉందని టీఆర్ఎస్ అనుమానిస్తోంది. అందుకే దాదాపు ఏడాది ముందే అసెంబ్లీ రద్దు చేయాలనుకుంటోందని తెలుస్తోంది.
వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారని అంటున్నారు. జనవరి చివర లేదా ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేసినా.. కర్ణాటకతో పాటు ఎన్నికలు నిర్వహించటానికి మూడు నెలలకుపైగానే సమయం ఉంటుంది. కాబట్టి కచ్చితంగా కర్ణాటకతోనే తెలంగాణ ఎన్నికలు వస్తాయని కేసీఆర్ భావిస్తున్నారని.. ఈ దిశగా పార్టీ కీలక నేతలకు సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.
డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల తర్వాత సెక్రటేరియేట్, అంబేద్కర్ విగ్రహం లాంటి ప్రధాన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు కేసీఆర్. సచివాలయ ప్రారంభోత్సవానికి సంక్రాంతిని ముహూర్తంగా ఎంచుకున్నట్లు తెలిసింది. అమరుల స్మారకాన్నిఅదేరోజు ప్రారంభించేలే పనులు జరుగుతున్నాయి. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా ఎన్టీఆర్ ఘాట్ పక్కనే వచ్చే నెల్లోనే ఆవిష్కరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
డిసెంబర్ మొదటి వారం నుంచి జిల్లా కలెక్టరేట్ల భవనాలను వరుసగా ప్రారంభించేలా సీఎం పర్యటన షెడ్యూలు సిద్దమైంది, సీఎం జిల్లాల పర్యటన సందర్భంగా భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. 2014లో తెలంగాణలో టీఆర్ఎస్అధికారంలోకి వచ్చింది. అయితే ఐదేళ్ల పదవీకాలం పూర్తికాక ముందే ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్. 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 2018 డిసెంబర్లోనే ఎన్నికలకు వెళ్లి రెండోసారి మళ్లీ అధికారంలోకి వచ్చారు.
Also Read: Umran Malik: ఉమ్రాన్‌కు అతిపెద్ద బలం అదే.. ప్రశంసలు కురిపించిన భారత మాజీ పేసర్!
Also Read: Idem Karma: ఇదేం కర్మపై వ్యతిరేకత, తెలుగు తమ్ముళ్లకు నచ్చని రాబిన్ శర్మ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook