BRS POLITICS: కారులో ఉక్కపోత.. బీఆర్‌ఎస్‌కు మరో లీడర్ గుడ్‌బై?

Sandra venkata veeraiah: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌కు మరో నేత ఝలక్ ఇవ్వబోతున్నారా..! గులాబీ పార్టీలో ఆయన ఉక్కపోతకు గురవుతున్నారా..! పార్టీ మారితే తప్ప.. తనకు రాజకీయ భవిష్యత్తు లేదని భావిస్తున్నారా..! గతంలో తనకున్న పరిచయాలతో పాత స్నేహితులకు దగ్గరవ్వాలని భావిస్తున్నారా..! ఇంతకీ ఎవరా గులాబీ లీడర్‌..! 

Written by - G Shekhar | Last Updated : Dec 3, 2024, 08:09 PM IST
BRS POLITICS: కారులో ఉక్కపోత.. బీఆర్‌ఎస్‌కు మరో లీడర్ గుడ్‌బై?

Sandra venkata veeraiah: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ అంతంత మాత్రమే.. 2014 అసెంబ్లీ ఎన్నికల నుంచి 2023 వరకు గులాబీ పార్టీ అన్ని జిల్లాల్లో పుంజుకున్న ఖమ్మం జిల్లాలో మాత్రం ఆశించినా స్థాయిలో పట్టు సాధించలేదు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో మూడుసార్లు ఎన్నికలు జరిగితే ఎన్నిక జరిగిన ప్రతిసారి ఒక్కరేసి చొప్పున మాత్రమే గెలిచారు. అయితే 2014లో మాత్రం కొందరు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన లీడర్లు అధికార పార్టీలో చేరిపోవడంతో ఆ బలం మరింత రెట్టింపు అయ్యింది. ఇందులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ఒకరు.. అయితే రాష్ట్రంలో కారు పార్టీ అధికారం కోల్పోగానే సండ్ర వెంకట వీరయ్య కూడా పక్క చూపులు చూస్తున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 

ఇక సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య హ్యాట్రిక్‌ విజయం నమోదు చేశారు. గత కేసీఆర్‌ ప్రభుత్వంలో సండ్రకు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగినా.. సమీకరణాల నేపథ్యంలో సాధ్యపడలేదు. అయితే సండ్రకు కేసీఆర్ మాత్రం అత్యంత  ప్రాధాన్యత ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి. కానీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సండ్రకు సత్తుపల్లి ప్రజలు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. అక్కడ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మట్ట రాగమయి భారీ మెజారిటీతో విజయం సాధించారు. కానీ ఓటమిని అంగీకరించిన సండ్ర మాత్రం.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటూ క్యాడర్‌ చేజారి పోకుండా జాగ్రత్త పడుతున్నారు.

అయితే కొద్దిరోజులుగా సండ్రకు రాజకీయ భవితవ్యంపై తెగ టెన్షన్‌ పడుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సత్తుపల్లి జనరల్‌ సీటుగా మారే చాన్స్ ఉందని పరేషాన్ అవుతున్నారట. ఒకవేళ నియోజకవర్గాల పునర్ విభజన జరిగి.. సత్తుపల్లి జనరల్‌గా మారితే.. తన రాజకీయ భవిష్యత్తు ఏంటని అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్‌ ఇస్తున్నారు. అలాగని తనను మరో నియోజకవర్గానికి మార్చే పరిస్ధితి లేదని టెన్షన్ పడుతున్నారట. అందుకే మాజీ ఎమ్మెల్సీ సండ్ర వెంకటవీరయ్య పార్టీ మారుదామని డిసైడ్‌ అయ్యారని తెలుస్తోంది. 

ఇక సండ్ర వెంకటవీరయ్య పొలిటికల్‌ లైఫ్‌ తెలుగుదేశంలోనే మొదలైంది. 2014 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. అప్పట్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్‌ రెడ్డి, లాంటి నేతలతో చాలా క్లోజ్‌గా ఉన్నారు. ఆ పరిచయాలతో అధికార పార్టీకి దగ్గరవ్వాలని భావిస్తున్నారట. అయితే సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపు వస్తే మాత్రం కండువా మార్చేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఓటుకు నోటు కేసులో కీలక సాక్షిగా ఉన్న సండ్ర వెంకటవీరయ్యను పార్టీ మారకుండా కేసీఆర్‌ బుజ్జగిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే కీలక పదవి అప్పగిస్తామని హామీ సైతం ఇచ్చినట్టు టాక్‌ వినిపిస్తోంది. 

మరోవైపు సండ్ర అధికార పార్టీలో చేరితే తన పరిస్థితి ఏంటని పార్టీ పెద్దలను ఎమ్మెల్యే మట్ట రాగమయి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. సండ్ర వెంకటవీరయ్యపై వ్యతిరేకతతోనే తనను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారని.. ఆయన్ను పార్టీలోకి చేర్చుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువని అంటున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేల జంపింగ్‌లతో కాంగ్రెస్ పార్టీ కుతకుతలాడుతోంది. ఈ నేపథ్యంలో సండ్ర రాజయకీయ భవిష్యత్తు ఎలా ఉండనుందోనని అనుచరులు సైతం చెవులు కొరుక్కుంటున్నట్టు తెలుస్తోంది..!

Also Read: BRS Party: మెదక్‌ బీఆర్‌ఎస్‌లో కుర్చీలాట.. కీలక నేతలు జంప్‌!

Also Read: Congress Politics: కేబినెట్‌ విస్తరణలో ట్విస్ట్‌.. నలుగురే కొత్త మంత్రులు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News