KT Rama Rao: తెలంగాణలో మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టుపై తీవ్ర రాజకీయ వివాదం ఏర్పడగా.. మరోసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ రెచ్చిపోయారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీకి డబ్బుల మూటలు పంపించేందుకు మాత్రమే మూసీ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ముందరవేసుకున్నారని ఆరోపించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక మూసీ పేరుతో డ్రామాలు చేస్తున్నాడని మండిపడ్డారు.
Also Read: Rave Party: కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ? భారీగా విదేశీ మద్యం, అమ్మాయిలు అరెస్ట్
కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన ఎస్‌టీపీల పరిశీలన చేపడుతున్న బీఆర్‌ఎస్ పార్టీ బృందం ఆదివారం ఉప్పల్‌లో సందర్శించింది. ఉప్పల్‌లోని ఎస్టీపీని సందర్శించి దాని వివరాలను ప్రజలకు చూపించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.'మురికి కూపంలా ఉన్న మూసీని స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సుందరీకరణ చేపట్టింది. ఎస్టీపీలను సక్రమంగా నడిపితే నల్లగొండ జిల్లాకు పరిశుభ్రమైన నీరు వెళ్తుంది' అని పేర్కొన్నారు.
Also Read: Metro Rail: హైదరాబాద్ ప్రజలకు భారీ శుభవార్త.. పరుగులు పెట్టనున్న మెట్రో రైలు రెండో దశ
'వంద శాతం మురుగునీటిని శుద్ధి చేసిన నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఇది కేసీఆర్ ఘనతే' అని కేటీఆర్ తెలిపారు. 'గతంలోనే రూ.3,800 కోట్ల ఖర్చుతో ఎస్టీపీలను నిర్మించాం. మూసీకి పునరుజ్జీవం తేవాలంటే ముందుగా నీటిని శుద్ధి చేయాలి. మూసీ శుద్ధి కోసం కేసీఆర్ ఆనాడే సంకల్పించారు' అని గుర్తు చేశారు. 'గతంలో కాంగ్రెస్ మూసీ ద్వారా నల్లగొండకు మురుగు నీరు పంపితే.. బీఆర్‌ఎస్ హయాంలో శుద్ధజలాలను పంపించే ప్రణాళికలను అమలు చేసింది' అని వివరించారు.
'బీఆర్‌ఎస్ కట్టిన ఎస్‌టీపీలను తామే కట్టినట్లు రేవంత్‌రెడ్డి గొప్పలు చెబుతున్నాడు. కొండ పోచమ్మ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను మూసీ నదికి అనుసంధానం చేయాలని ఆనాడే కేసీఆర్ నిర్ణయించారు. దీనికి 2023లోనే రూ.1,100 కోట్లతో మూసీ అనుసంధాన పనులు చేపట్టాం' అని కేటీఆర్ వెల్లడించారు. ఎస్టీపీలు, బ్రిడ్జిలు, గోదావరి అనుసంధానంతో మూసీకి పునరుజ్జీవం పోసిందే బీఆర్‌ఎస్ అని స్పష్టం చేశారు.
'మూసీ డెవలప్ అథారిటీ చైర్మన్‌గా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఉన్నప్పుడే పనులన్నీ దాదాపు పూర్తి చేశాం. ఢిల్లీకి మూటలు పంపేందుకే రేవంత్ రెడ్డి మూసీని ముందర వేసుకున్నారు' అని కేటీఆర్ ఆరోపించారు. ఆరు గ్యారంటీలపై పెద్ద ఎత్తున పోరాడుతామని స్పష్టం చేశారు. 'మీ ఇంటికి బుల్డోజర్ వస్తే మేం ముందుంటాం' అని తెలిపారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదు కాబట్టే కక్ష కట్టారని చెప్పారు. మూసీ సుందరీకరణకు బీఆర్‌ఎస్ వ్యతిరేకం కాదని.. పేదలను రోడ్డుపై పడేసే లూటిఫికేషన్‌కు మాత్రమే తాము వ్యతిరేకమని కేటీఆర్ స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook