వరంగల్: జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం చీటూరు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోలీసు కానిస్టేబుల్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారిక వాహన డ్రైవర్ చిలకమర్రి పార్థసారథి అంత్యక్రియలు ముగిశాయి. పార్థసారథి అంతిమయాత్రలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి ఎర్రబెల్లి సతీమణి ఉష, కుమారుడు ప్రేమ్ చందర్ రావు, సోదరుడు ప్రదీప్ రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు. అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రి దయాకర్ రావు గోపాలపురంలోని పార్థసారథి ఇంటి వద్ద పాడేమోశారు. పార్థసారథి మృతదేహం వద్ద మంత్రి ఎర్రబెల్లి కన్నీటి పర్యంతమయ్యారు. పద్మాక్షి సమీపంలోని శివముక్తీ ధామ్‌లో పార్థసారథి అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. తుపాకీ కాల్పులతో అధికార లాంఛనాల మధ్య పార్థసారథి అంత్యక్రియలు పూర్తయ్యాయి. Read also > జనగామ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లిని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు
అంతకంటే ముందుగా పార్థసారథి మృతి వార్త తెలుసుకున్న అతడి కుటుంబసభ్యులు జనగామ ఆసుపత్రికి చేరుకున్న సందర్భంలోనూ వారిని ఓదార్చే క్రమంలో మంత్రి ఎర్రబెల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్థసారథి ఎప్పుడూ నెమ్మదిగానే వాహనం నడిపేవాడని.. కానీ ఈరోజు ఎందుకిలా జరిగిందోనని ఆవేదన వ్యక్తంచేశారు. తన వద్ద సోషల్ మీడియా ఇంచార్జ్‌గా పనిచేస్తోన్న యువకుడు పూర్ణ(27) కూడా ఈ ప్రమాదంలోనే కన్నుమూయడం మంత్రి ఎర్రబెల్లిని మరింత విషాదంలోకి నెట్టింది. పని విషయంలో ఎంతో చురుకుగా ఉండే ఇద్దరు సిబ్బందిని ఇలా రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకోవడం తీవ్ర విషాదానికి గురిచేస్తోందని మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. Related News : మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్కి ప్రమాదం.. మంత్రి సేఫ్.. డ్రైవర్ సహా ఇద్దరు మృతి!