సూర్యాపేట: హుజూర్నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైది రెడ్డి గెలుపుపై కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి స్పందించారు. ఈవీఎంలను మేనేజ్ చేసినందువల్లే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని పద్మావతీ రెడ్డి ఆరోపించారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితాల వెల్లడి అనంతరం గురువారం సాయంత్రం సూర్యాపేటలో పద్మావతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ''మొట్టమొదటి రౌండ్లోనే టీఆర్ఎస్ అభ్యర్థికి 2వేల మెజారిటీ రావడంతోనే తనకు అనుమానం వచ్చిందని అన్నారు. ఇది తన ఒక్కరి అనుమానం మాత్రమే కాదని.. తనతో పాటు స్వతంత్ర అభ్యర్థులకూ ఇవే సందేహాలు కలుగుతున్నాయన్నారు. స్వతంత్ర అభ్యర్థులకు కనీసం వారి కుటుంబ సభ్యుల ఓట్లు కూడా పడకపోవడమే ఈవీఎంలను మేనేజ్ చేశారనే అనుమానాలకు బలం చేకూర్చిందన్నారు.
యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను ప్రతిబించేలా ప్రచారం చేసినప్పటికీ.. ఫలితాలు అందుకు భిన్నంగా రావడం తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని పద్మావతీ రెడ్డి ఆవేదనకు వ్యక్తంచేశారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ తరహా ఫలితాలు రావడం కేవలం ఈవీఎంల వల్లే సాధ్యపడిందని.. అందుకే ఈవీఎంల ద్వారా వచ్చిన ఫలితాలు సరైనవి కావని ఆమె అభిప్రాయపడ్డారు.