TS Tenth class exams: హైదరాబాద్: తెలంగాణలో పదవ తరగతి పరీక్షలపై సందిగ్ధత కొనసాగుతోంది. కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో జూన్ 8 నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ( TS SSC exams) జరగనున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఈ పరీక్షలను నిర్వహించడం అవసరమా అనే కోణంలో హైకోర్టులో విచారణ జరుగుతోంది. కంటైన్మెంట్ జోన్లలో ఉండి పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థుల పరిస్థితి ఏంటని శుక్రవారం నాటి విచారణలో హై కోర్టు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే, అలా కంటైన్మెంట్ జోన్ల నుంచి పరీక్షలకు హాజరు కాలేకపోయిన విద్యార్థులకు సప్లిమెంటరీ రాసే అవకాశం కల్పిస్తామని తెలంగాణ సర్కార్ (Telangana govt) తరపున అడ్వొకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ నిన్ననే కోర్టుకు తెలిపారు. ( Telangana: కరోనాతో రాష్ట్రంలో మరో 8 మంది మృతి )
సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాస్ అయిన విద్యార్థులను కూడా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తారా అని హై కోర్టు వేసిన ప్రశ్నకు సర్కారు అవుననే సమాధానం ఇచ్చింది. ఈమేరకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు.
పంజాబ్ తరహాలో ఎందుకు చేయరని ప్రశ్నించిన హై కోర్టు ?
పంజాబ్ తరహాలో పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాల్సిందిగా పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని ప్రస్తావిస్తూ.. పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇస్తే వచ్చే ఇబ్బందేంటని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
కీలకంగా మారిన జీహెచ్ఎంసీ పరిధిలో పరీక్షల అంశం:
జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీతో పాటు రంగా రెడ్డి జిల్లా పరిధిలో టెన్స్ క్లాస్ పరీక్షలను వాయిదా వేసుకోవాల్సిందిగా హై కోర్టు ప్రభుత్వానికి సూచించింది. అయితే, రాష్ట్రంలో వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం సాంకేతికంగా కష్టమవుతుందని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రశ్నపత్రం మళ్లీ మళ్లీ రూపొందించడం, లీకేజీలను నివారించడం ఇబ్బంది అవుతుందని ఏజీ బిఎస్ ప్రసాద్ కోర్టుకు విన్నవించుకున్నారు. ఏజీ బిఎస్ ప్రసాద్ సమాధానంతో సంతృప్తి చెందని కోర్టు.. విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా.. సాంకేతిక అంశాలు ముఖ్యమా అని నిలదీసింది. దీంతో ప్రభుత్వంతో సంప్రదించి చెబుతామని ఏజీ ప్రసాద్ బదులివ్వడంతో.. ప్రభుత్వం నిర్ణయం ఏదైందీ చెప్పాల్సిందిగా పేర్కొంటూ కోర్టు విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.
శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ విచారణకు తెలంగాణ విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ( SSC exams : 10వ తరగతి పరీక్షలకు ప్రత్యేక ఏర్పాట్లు )
హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..