Telangana Davos Summit: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వర్షం కురిసింది. సదస్సు ప్రారంభం రోజే దాదాపు రూ.38 వేల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రచార ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులతో కూడిన బృందం దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ సదస్సు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలియన్‌ను దిగ్గజ కంపెనీల ప్రతినిధులు సందర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన ఆయా కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ)లు కుదుర్చుకున్నారు.
అత్యధికంగా అదానీ సంస్థ రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టుకునేందుకు ముందుకువచ్చింది. ఈ సందర్భంగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సీఎంతో సమావేశమయ్యారు. ఇక తెలంగాణలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని అదానీ సంస్థ నిర్ణయించింది. ఇక పలు విద్యుదుత్పత్తి సంస్థలతోపాటు బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాలు, జీవ వైద్య, ఔషధ సంస్థలు, డేటా కేంద్రాల స్థాపనకు పలు సంస్థలు అంగీకరించాయి. కొత్తగా కుదిరిన ఒప్పందాల ద్వారా తెలంగాణలో వేల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
పెట్టుబడులు ఇలా..
సంస్థ | పెట్టుబడి (రూ.కోట్లలో) |
అంబుజా సిమెంట్స్ | 1,400 |
అదానీ గ్రూప్ | 12,400 |
జేఎస్‌డబ్ల్యూ | 9,000 |
గోది ఇండియా | 8,000 |
వెబ్ వర్క్స్ (ఐరన్ మౌంటెన్) | 5,200 |
అరాజెన్ లైఫ్ సైన్సెస్ | 2,000 |
గోద్రెజ్ | 1,270 |
దిగ్గజ కంపెనీలు
అదానీ సంస్థ గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, ఏరో స్పేస్, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాలతోపాటు 'ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ స్కిల్లింగ్ యూనివర్సిటీ' ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఇక అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ పరిశ్రమ ఏర్పాటుకు అంగీకరించింది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ నియో ద్వారా పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. గోది ఇండియా 'గిగా స్కేల్ బ్యాటరీ సెల్' తయారీ కేంద్రం నెలకొల్పాలని నిర్ణయించింది. వారితోపాటు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఈడీ రాబిన్ వాన్ పుయెన్ బ్రోక్, సీఐఐ తెలంగాణ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు.
ప్రభుత్వ వర్గాలు హర్షం
తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలుస్తుందని చెప్పడానికి వచ్చిన పెట్టుబడులే నిదర్శనంగా కనిపిస్తోంది. పెట్టుబడులు భారీగా రావడంతో ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పెట్టుబడులకు తమ ప్రభుత్వం స్నేహాపూర్వక వాతావరణం కల్పిస్తోందని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. సాంకేతిక పరిజ్ణానంతోపాటు అన్ని రంగాల్లో హైదరాబాద్‌ను, తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామిక రంగ ప్రతినిధులతో చెప్పారు. ఈ సందర్భంగా పరిశ్రమల ప్రోత్సాహానికి ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, అనుమతుల విషయమై పరిశ్రమల ప్రతినిధులకు వివరించారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణకు మరికొన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
Also Read Rythu Bandhu and Loan Waiver: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఒకేసారి రైతుబంధు, రుణమాఫీ
Also Read Addanki Dayakar: అద్దంకి దయాకర్‌కు మరోసారి హ్యాండిచ్చిన కాంగ్రెస్.. అసలేం జరిగిందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter