అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచ ధనిక సీఈఓల్లో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను సైతం అధిగమించి ఆయన వార్తల్లో నిలిచారు. ఈ రోజే అమెజాన్ కంపెనీ ట్రేడింగ్ విలువ 6.1 బిలియన్ డాలర్లను చేరుకోవడంతో.. ఆయన సంపద మొత్తం 105 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తద్వారా ఆయన ప్రపంచంలో అత్యధిక ధనవంతుడైన సీఈఓగా వార్తల్లోకెక్కారు.
2018 ప్రారంభమైన కొద్ది రోజులకే ఆయన ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ అధికారులు ధ్రువీకరించారు. ప్రస్తుతం జెఫ్ బెజోస్ తర్వాతి స్థానంలో ఉన్న బిల్‌గేట్స్ ఆస్తుల విలువ కేవలం 93.3 బిలియన్ డాలర్లు మాత్రమే. అలాగే మూడవ స్థానంలో బెర్క్‌షైర్ హాత్వే సీఈఓ వారెన్ బఫెట్ ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ 87.2 బిలియన్ డాలర్లు.
అయితే ఈ విషయంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. బిల్‌గేట్స్ స్థానాన్ని మించడం ఎవరికీ సాధ్యం కాని పని అని.. గేట్స్ తన ఫౌండేషన్ ద్వారా గత సంవత్సరం చాలా మొత్తం వెచ్చించారని.. లేకుంటే ఆయన ఆస్తుల విలువ 150 బిలియన్ డాలర్లకు పైగానే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
అలాగే నాల్గవ స్థానంలో ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ (77.5 బిలియన్ డాలర్లు), ఐదవ స్థానంలో ఐండీటెక్స్ ఫ్యాషన్ గ్రూప్ ఛైర్మన్ అమాన్సియో ఆర్టేగా (76 బిలియన్ డాలర్లు), ఆరవ స్థానంలో మెక్సికన్ వ్యాపారవేత్త కార్లోస్ స్లిమ్ (64.1 బిలియన్ డాలర్లు) ఉన్నారు.