ఆఫ్ఘనిస్తాన్ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న తాలిబన్ సేనలకు రష్యా సహాయం చేస్తుందనే ఆరోపణలను ఆ ప్రభుత్వం ఖండించింది. ఇటీవలే అమెరికాకి చెందిన ఓ రక్షణ ఉద్యోగి ఈ అంశాన్ని లేవనెత్తుతూ రష్యా అధికారులు తాలిబన్లకు ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని తెలపడం గమనార్హం.
తాము ఒక వైపు ఉగ్రవాదం పై పోరాటం చేస్తుంటే.. రష్యా మాత్రం ఉగ్రవాదులకు మద్దతు కూడగట్టే విధంగా ప్రవర్తించడం ఏమిటని ఆయన విమర్శించారు. అయితే ఆ అమెరికన్ రక్షణ అధికారి చెప్పినవన్నీ అబద్ధాలనీ, నిరాధారమైనవని ఇటీవలే రష్యా దౌత్య కార్యాలయం తెలిపింది. గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు వస్తే తాము ఖండించామని రష్యా తెలియజేసింది. అవాస్తవాలతో రష్యాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆ దేశ దౌత్య కార్యాలయం పేర్కొంది