అంతర్యుద్ధంతో కకావికలం అయిన సిరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి షాకే ఇచ్చారు. సిరియాకు అందిస్తున్న భారీ ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు చెప్పారు. సిరియాకు అందిస్తున్న సుమారు 200 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ట్రెజరీ శాఖకు ఉత్తర్వులు అందించినట్లు అధికారులు తెలిపారు. గతవారం సిరియా నుంచి అమెరికా దళాలను వెనక్కి మళ్లిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్.. తాజా నిర్ణయంతో సిరియాలో పునర్ నిర్మాణానికి కూడా మంగళం పాడినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరిలో కువైట్ పర్యటన సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్.. సిరియా పునర్మిణానికి ఈ భారీ ఆర్థిక సాయం ప్రకటన చేశారు. దాడుల్లో ధ్వంసమైన ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల నిర్మాణాలు, రోడ్ల నిర్మాణం, విద్యుత్, నీటి సదుపాయాల కోసం వీటిని ఖర్చుచేయనున్నట్లు టిల్లర్సన్ ఆ సమయంలో వెల్లడించారు. ఇక సిరియన్ డెమొక్రటిక్ దళాలకు సాయంగా అగ్రరాజ్యం 2 వేల మంది సైనికులను దశాబ్దం క్రితమే సిరియాలో మోహరించింది. తాజా నిర్ణయంతో త్వరలో వారంతా స్వదేశానికి తిరిగిరానున్నారని అమెరికా పేర్కొంది.