జగన్ ఇంగ్లీష్‌పై ప్రశంసలు.. నారా వారి ఇంగ్లీష్‌పై ఏపీ మంత్రి వ్యంగ్యాస్త్రాలు

జగన్ ఇంగ్లీష్‌పై ప్రశంసలు.. నారా వారి ఇంగ్లీష్‌పై ఏపీ మంత్రి వ్యంగ్యాస్త్రాలు

Last Updated : Nov 11, 2019, 08:15 PM IST
జగన్ ఇంగ్లీష్‌పై ప్రశంసలు.. నారా వారి ఇంగ్లీష్‌పై ఏపీ మంత్రి వ్యంగ్యాస్త్రాలు

విజయవాడ: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయంచుకున్నప్పటి నుంచి ఈ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు మరింత ఎక్కువైన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ టీడీపీ విమర్శల దాడి చేస్తుండగా.. ప్రతిపక్షం విమర్శలను అధికారపక్షం సైతం అదేస్థాయిలో తిప్పికొడుతోంది. ఈ క్రమంలోనే ఈ విషయమై చంద్రబాబు చేస్తోన్న విమర్శలను తీవ్రంగా తప్పుపట్టిన వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. చంద్రబాబు తన మనవడు దేవాంష్‌ని అయితే తెలుగు మీడియంలో చదివిస్తారా అని ప్రశ్నించిన సంగతి కూడా తెలిసిందే. 

ఇదిలావుండగా తాజాగా ఇదే ఇంగ్లీష్ మీడియం వివాదంపై టీడీపీ చేస్తోన్న విమర్శలను ఖండిస్తూ ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రతిపక్షంపై పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ''ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంగ్లిష్‌లో మాట్లాడితే జాతీయ ఛానళ్లే ఆశ్చర్యపోతాయని.. అదే సమయంలో నారా వారు ఇంగ్లిషులో ఎలా మాట్లాడితే ఎలా ఉంటుందో  మనం చూశాం'' అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎద్దేవా చేశారు. ''బ్రీఫ్డ్ మీ'' అంటూ గతంలో వైరల్‌గా మారిన మాటలను ఆయన ఇక్కడ గుర్తు చేశారు. ఏపీలో ఇంగ్లిష్ మీడియంలో బోధనను అందుబాటులోకి తీసుకొచ్చి విద్యార్థులకు ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం పెంచేందుకు సీఎం జగన్ కృషిచేస్తోంటే.. కొంతమంది అనవసరంగా అవాకులు, చెవాకులు పేలుతూ విమర్శలు చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌లో జరిగిన ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమంలో మంత్రి సురేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Trending News