Anil Kumar Yadav About AP CM YS Jagan: రాజకీయాల్లో ఉన్నంత కాలం తన చివరి శ్వాస వరకు జగన్ వెంటే ఉంటానని.. జగన్ కోసమే పని చేస్తానని మాజీ మంత్రి డా అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జగనన్న తనను తరిమేసినా.. తిట్టినా.. నువ్వు ఈ పార్టీలో ఉండొద్దని చెప్పినా.. తాను జగన్ వెంటే ఉంటాను కానీ పార్టీ మారి వేరే గుమ్మం తొక్కే ప్రసక్తే లేదు అని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. తన తండ్రి సాక్షిగా ఈ విషయం చెబుతున్నా అని అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మాకు ఒక వ్యసనం.. ఆయన కోసం ఏమైనా చేస్తా.. తాను ఎమ్మెల్యే అయినా.. మంత్రి అయినా అది తనకు జగన్ పెట్టిన బిక్షే అని మాజీ మంత్రి అనిల్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను కొందరితో దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చిన అనిల్ కుమార్ యాదవ్.. ఒక మనిషిపై మనకు మంచి అభిప్రాయం లేనప్పుడు ఆ మనిషికి దూరంగా ఉండటం మేలు అని అన్నారు.
ఒక పెళ్లికి వెళ్లి అక్షింతలు వేసి ఆ నవ వధువు మెడలో తాళి ఎప్పుడు తెగుతుందా అని దీవించే కన్నా.. ఆ పెళ్లికి వెళ్లకపోవడమే మేలు అని భావించే వ్యక్తిని తాను అని వ్యాఖ్యానించారు. పక్క పక్కన కూర్చుని వీడు ఎప్పుడు నాశనం అయిపోతాడా అని కోరుకునే బదులు.. మనకు నచ్చని వారికి దూరంగా ఉండడమే గౌరవం అనుకునే మనస్తత్వం తనది అని అభిప్రాయపడ్డారు. అందుకే తాను కొందరితో విభేదించానని.. ఆ ప్రకారమే నడుచుకుంటున్నానని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. తన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ ని ఉద్దేశించే అనిల్ కుమార్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు నెల్లూరు రాజకీయాల్లో బహిరంగ ప్రచారం జరుగుతోంది.
పేరున్న గొర్రె కన్నా ఒంటరి సింహంగా ఉండటం మేలు అని వ్యాఖ్యానించిన అనిల్... ఒక సంవత్సరం పాటు తన గురించి కొందరు రకరకాలుగా మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు అవన్నీ సీఎం జగనన్నకు చెబుతా అని గుర్తుచేశారు. తనకు ఏదైనా బాధ కలిగితే కచ్చితంగా తనను బాధించిన విషయం గురించి సీఎం జగన్ కి చెప్పుకుంటా అని పేర్కొన్నారు. ఒకవేళ " అనిల్.. నువ్వు నెల్లూరు సిటీలో ఓడిపోతావు.. నువ్వు పోటీ నుంచి తప్పుకో " అని సీఎం జగన్ చెబితే అలాగే తప్పుకుంటా. ఇది తనకు జగన్ ఇచ్చిన పదవి.. ఆయన ఇచ్చిన పదవిని ఆయనే తీసుకుంటానంటే ఎలాంటి అభ్యంతరం చెప్పను అని తన మనసులోని మాటను బయటపెట్టారు.
రాజకీయాల్లో నా భవిష్యత్తును ఆ భగవంతుడు, జగన్మోహన్ రెడ్డి, నెల్లూరు ప్రజలే నిర్ణయిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు అని అనిల్ కుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నానన్న అనిల్ కుమార్.. వైసీపీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవరని తాను మాట్లాడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అదొక ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. తన రాజకీయ ప్రత్యర్థుల గురించి, సీఎం జగన్ గురించి తన అభిప్రాయం ఏంటనే అంశాలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కుండబద్దలు కొట్టినట్టు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.