Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామంటూ జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పొత్తుల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ప్రస్తుతం బీజేపీ-జనసేన మిత్రపక్షాలుగా ఉన్నాయి. పొత్తులపై పవర్ స్టార్ చేసిన కామెంట్లను స్వాగతించేలా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అంతేకాదు జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించేందుకు త్యాగాలకు కూడా సిద్ధమని ప్రకటించారు. టీడీపీ నేతలు ఓపెన్ గానే జనసేనతో పొత్తు ఉండాలని చెబుతున్నారు. బీజేపీ కలిస్తే బాగుంటుందని కామెంట్ చేస్తున్నారు. టీడీపీ నేతల ప్రకటనలు, జనసేన తీరుతో 2014 తరహాలోనే వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిగా ఏర్పడుతాయనే ప్రచారం సాగింది. అయితే టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయడంపై అడ్డంకులు లేకున్నా బీజేపీ విషయంలోనే క్లారిటీ రాలేదు.
తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. హైకమాండ్ క్లారిటీ ఇవ్వకపోయినా.. రాష్ట్ర నేతలు మాత్రం పొత్తులపై స్పందిస్తున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు టీడీపీతో పొత్తు ఉండదని చెబుతుండగా.. సత్యకుమార్, లంకా దినకర్ వంటి నేతలు మాత్రం టీడీపీతో పొత్తుపై సానుకూలంగా స్పందిస్తున్నారు. 2014లో ప్రధాని మోడీతో చంద్రబాబు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. బీజేపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలే గెలిచినా... ఇద్దరికి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కింది. అటు కేంద్రంలోనూ టీడీపీ ఎంపీలకు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరీలకు అవకాశం లభించింది. అయితే 2018లో బీజేపీతో విభేదించారు చంద్రబాబు. కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ బయటికి వచ్చింది. రాష్ట్రంలో పొత్తు తెగిపోయింది. ఆ తర్వాత బీజేపీని టార్గెట్ చేశారు చంద్రబాబు. జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలతో కలిసి ఉద్యమించారు. సోనియా గాంధీ. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీతో కలిసి పలు బహిరంగ సభలు నిర్వహించారు. ఆ సమయంలోనే తిరుపతి శ్రీవారి దర్శనానికి వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షాను అడ్డుకోవడానికి టీడీపీ ప్రయత్నించడం.. ఆయన కాన్వాయ్ పై దాడికి యత్నించడం దేశ వ్యాప్తంగా సంచలనమైంది.
తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి దేశవ్యాప్తంగా సభలు పెట్టిన చంద్రబాబును బీజేపీ పెద్దలు టార్గెట్ చేశారు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ గెలిచేలా బీజేపీ సహకరించిందనే ప్రచారం ఉంది. చంద్రబాబు ఆర్థికమాలాలను దెబ్బకొట్టి ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తీసిందని అంటారు. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ తీరు మారింది. బీజేపీతో సయోధ్యకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే కేంద్రం పెద్దల నుంచి మాత్రం సిగ్నల్ రాలేదు. ఇటీవల కాలంలో పొత్తుల విషయంలో కేంద్ర పెద్దలతో మాట్లాడటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా టీడీపీ-బీజేపీ పొత్తుపై కేంద్రం పెద్దలతో మాట్లాడుతున్నారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కీలక పరిణామం జరిగింది. కేంద్ర సర్కార్ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర సర్కార్ నుంచి పిలుపు వచ్చింది. మోడీ సర్కార్ ఆహ్వానంతో ఈ నెల 6న ఢిల్లీకి వెళ్తున్నారు చంద్రబాబు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావాలని ఆహ్వానం వచ్చిన వెంటనే అంగీకరించారు చంద్రబాబు. ప్రధాని మోడీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ఈ సమావేశం జరగనుంది. చాలా కాలం తర్వాత ప్రధాని మోడీతో కలిసి సమావేశంలో పాల్గొనబోతున్నారు చంద్రబాబు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు విషయంలో బీజేపీ కోపం క్రమంగా తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత నెలలో ప్రధాని మోడీ భీమవరం పర్యటనలోనూ అల్లూరి విగ్రహావిష్కరణకు తెలుగుదేశం పార్టీని ఆహ్వానించారు. వరుసగా జరుగుతున్న ఘటనలతో కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నట్లు టీడీపీ-బీజేపీ మళ్లీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. చంద్రబాబుకు ఢిల్లీ ఆహ్వానంపై వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబుకు కేంద్ర సర్కార్ పిలుపు రావడంతో టీడీపీలో సంతోషం వ్యక్తమవుతోంది.
Read also: Nethanna Bima: చేనేతకు పెద్దపీట వేస్తున్నాం..7న అద్భుత పథకం తీసుకొస్తున్నామన్న కేటీఆర్..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook